నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో మిగిలిన తరగతుల వార్షిక పరీక్షలు కూడా పూర్తి కానున్నాయి. అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసంతో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ పొందేందుకు విద్యార్థులు మక్కువ చూపుతూంటారు. క్రీడల ద్వారా తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తల్లిదండ్రులు కూడా తపన పడుతూంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా వేసవిలో ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూంటాయి. ఏటా మే 1 నుంచి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన కాకినాడ అర్బన్, రూరల్ ప్రాంతాలతో పాటు కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న క్రీడాకారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వివిధ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేవారు (కోచ్‌లు) జిల్లా క్రీడా మైదానంలో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు ఒకింత నిరాశ కలిగిస్తోంది. క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు తగినట్టుగా చర్యలు తీసుకోవడం లేదు. ఖాళీ పోస్టుల్లో కొత్త కోచ్‌ల నియామకం చేపట్టడం లేదు. దీంతో, క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు క్రీడాకారుల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా క్రీడా మైదానంలో ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నో శిక్షణలకు అవకాశం
జిల్లా క్రీడా మైదానంలో హాకీ, ఫుట్‌బాల్, జుడో, రెజ్లింగ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్, యోగా, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో చేరిన విద్యార్థులకు సుమారు నెల రోజుల పాటు వారు ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ ఇస్తారు. వారిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి, సంవత్సరం పొడవునా శిక్షణ కొనసాగిస్తారు. ఈ క్రమంలో జిల్లా తరఫున రాష్ట్ర, జాతీయ, సౌత్ జోన్ పోటీల్లో ఆడేలా తర్ఫీదు ఇస్తారు. తద్వారా క్రీడాకారుల సంఖ్యను పెంచుతూ జిల్లా కీర్తిని రాాష్ట్ర, జాతీయ స్థాయిలకు విస్తరిస్తారు. వేసవి క్రీడా శిక్షణలకు ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, యోగా, తైక్వాండో, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలకు శాప్ కోచ్‌లు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. దీంతో, కొత్తగా క్రీడా శిక్షణలు పొందే వారికి సీనియర్ క్రీడాకారులు, ప్రైవేటు కోచ్‌లే దిక్కవుతున్నారు. వీరు ఏ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దగలరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా క్రీడా మైదానానికి వచ్చిన శాప్ పాలకవర్గం త్వరలోనే కోచ్‌ల నియామకాలు చేపడతామని, జిల్లాలో క్రీడల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని ఘనంగా చెప్పారు. కానీ, ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, శాప్ అధికారులు జిల్లా క్రీడా మైదానంలో ఖాళీగా ఉన్న కోచ్‌ల స్థానాల్లో అర్హులైన శాప్ కోచ్‌లను నియమించి, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సజావుగా జరిగేలా చూడాలని క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఫ పలు క్రీడలకు కోచ్‌ల కొరత
ఫ పట్టించుకోని శాప్, ఉన్నతాధికారులు
ఫ ప్రశ్నార్థకంగా వేసవి క్రీడా శిక్షణ


