అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి చైత్రమాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో పండితులు కలశ స్థాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి, ఘనంగా పూజలు చేశారు. రుత్విక్కులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం, రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గరగల సంబరం నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 17న అమావాస్య నాడు జరిగే చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా, కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా అమ్మవారికి బుధవారం చండీహోమం నిర్వహించారు.
గ్యాస్ ఏజెన్సీల్లో
జేసీ ఆకస్మిక తనిఖీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. నగరంలోని జ్యోతి, రామకృష్ణ గ్యాస్ ఏజెన్సీలలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేయాలని, వారి మొబైల్ నంబర్ ఎల్‌పీజీ గ్యాస్ కన్జూమర్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని అన్నారు. వినియోగదారులలు కంట్రోల్ రూముకు మాత్రమే కాకుండా సమస్యలపై నేరుగా తన వాట్సాప్ నంబర్ 88869 03611కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించి గ్యాస్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వ్యక్తుల పేరిట గ్యాస్ కనెక్షన్లు ఉండి, వారసుల పేరిట మార్పు జరగనప్పుడు తాత్కాలిక ఇబ్బంది ఉండవచ్చని అన్నారు. కానీ, మొబైల్ నంబరు, వివరాలు మార్చుకుని సులభంగా ఆన్‌లైన్ బుకింగ్ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని 42 గ్యాస్ ఏజెన్సీలు తప్పనిసరిగా ఓటీపీ విధానం అమలు చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఆన్‌లైన్ వివరాలు, మొబైల్ నంబర్లు సరి చేయాలని జిల్లా పౌర సరఫరా అధికారి ఆర్.సత్యనారాయణరాజుకు జేసీ సూచించారు.
చిన్నారులతో
కలెక్టర్ ముచ్చట్లు
పిఠాపురం రూరల్: మండలంలోని జల్లూరు అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సరకుల నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మాతా శిశు సంరక్షణపై అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం ఆయన కుమారపురం జెడ్పీ హైస్కూల్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు, ఇతర సదుపాయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


