అన్నవరం: సత్యదేవుని తోబుట్టువుగా రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారికి చైత్ర మాసోత్సవాల సందర్భంగా స్వామివారి తరఫున సిబ్బంది బుధవారం చీర, సారె సమర్పించారు. ఉదయం 8 గంటలకు సత్యదేవుని ఆలయం నుంచి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాలతో ఊరేగింపుగా సారె తీసుకుని మెట్ల దారిన కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు.
ఊరేగింపునకు సిబ్బంది దూరం
సారె సమర్పించే కార్యక్రమానికి సిబ్బంది అందరూ హాజరు కావాలని దేవస్థానం అధికారిక గ్రూపులో మంగళవారం మెసేజ్ పెట్టినా సిబ్బంది పట్టించుకోలేదు. సారెతో బయలుదేరేటప్పుడు సిబ్బంది, పండితులు 50 మంది వరకూ ఉండగా.. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరేసరికి 25 మంది కూడా లేరు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి, గంగబాబు, రమేష్, ముష్టి పురుషోత్తం, మరో నలుగురు పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు, ఫార్మసీ సూపర్‌వైజర్ వల్లూరి మాధవి, సూపరిండెంట్ పీవీ రమణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, మరో పది మంది వ్రత పురోహితులు, పరిచారకులు మాత్రమే పాల్గొన్నారు. దేవస్థానంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలు పది మంది, హోంగార్డులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబీకుల పెళ్లి ఊరేగింపులో సైతం పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. అటువంటిది కనీసం ఆ స్థాయిలో కూడా ఈ ఊరేగింపు నిర్వహించలేదు. దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది సుమారు 200 మంది, ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మరో 1,200 మంది ఉన్నారు. వీరు కాకుండా 250 మంది వ్రత పురోహితులు, వంద మంది నాయీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వీరిలో కనీసం 10 శాతం మంది పాల్గొన్నా కార్యక్రమం కళ కట్టేదని పలువురు అన్నారు. ఈ నెల 26 నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లోనైనా ఎక్కువ మంది సిబ్బంది పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.


