కాకినాడ రూరల్: మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కోరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తల దించుకునేలా రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం చేతకాని రాధాకృష్ణ వ్యాఖ్యలను కూటమి నేతలు సమర్థించడం చూస్తూంటే వారిపై అసహ్యం కలుగుతోందని అన్నారు. ఆయనను వెనకేసుకుని రావడానికి పడుతున్న శ్రమలో కాస్తయినా రాష్ట్రాభివృద్ధిపై పెట్టాలని అధికార కూటమి ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. రాధాకృష్ణ చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలను సిగ్గులేని వారే సమర్థిస్తారని మండిపడ్డారు. మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించి చంద్రబాబు మెప్పు పొందాలనుకోవడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో ఏబీఎన్ చానల్‌ను బహిష్కరించాలన్న ఆయన.. ఇప్పుడు ఆ చానల్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం చూస్తేనే మహిళల పట్ల ఆయనకున్న దృక్పథం అర్థమవుతోందన్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధత విషయంలో అనేక లొసుగులున్న విషయాన్ని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయమని 2020లో ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, అటువంటిది ఇప్పుడు చట్టబద్ధతకు ఎలా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో న్యాయపరమైన వివాదాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు మొదటి నుంచీ చెబుతున్నారని, అయితే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాత్రం అది సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టారని గుర్తు చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అమరావతి కాస్తా ఇప్పుడు అప్పుల అమరావతిగా మారిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ తరువాత ప్రపంచ బ్యాంకు రుణంతో అని మాట మార్చిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించి, మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారని నాగమణి పేర్కొన్నారు.


