రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

చింతూరు: మండలంలోని చట్టిలో బైక్‌ను తుఫాన్‌ వాహనం ఢీకొన్న ఘటనలో చింతూరు మండలం వీరాపురానికి చెందిన మోసం బుచ్చయ్య (35) మృతి చెందాడు. అనంతరం అదుపు తప్పిన తుఫాన్‌ వాహనం బోల్తా పడడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తెలంగాణలోని పెద్దిపల్లికి చెందిన కొంతమంది గిరిజనులు తుఫాన్‌ వాహనంపై ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో, చట్టి నుంచి వీరాపురానికి బైక్‌పై వెళుతున్న బుచ్చయ్యను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బుచ్చయ్య అక్కడికక్కడే మృతిచెందగా, తుఫాను వాహనం కూడా బోల్తా పడడంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బోల్తా పడిన వాహనంలో పిల్లలు, పెద్దలు కలిసి 17 మంది వరకూ ఉన్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోటారు సైకిల్‌ ఢీకొని..

ఉప్పలగుప్తం: మోటారు సైకిల్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్‌కే జానీ బాషా తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న సుందరనీడి నాగేశ్వరరావు (58) శుక్రవారం రాత్రి మూత్ర విసర్జనకు ఇంటి ఎదురుగా ఉన్న సిరిపల్లి – మునిపల్లె ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపైకి రాగా, ఉప్పలగుప్తం మధురపేటకు చెందిన సురేష్‌ గొల్లవిల్లి నుంచి ఉప్పలగుప్తం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో నాగేశ్వరరావు తలకు తీవ్ర గాయం కావడంతో అతనిని 108లో అమలాపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడి కుమారుడు బాబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

ఏడో తరగతి విద్యార్థినికి అస్వస్థత

రాజవొమ్మంగి: మండలంలోని అమీనాబాద్‌ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న ఏడో తరగతి విద్యార్థిని కర్రి నందిని శనివారం పాఠశాలలో ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురైంది. అదే గ్రామంలోని బాలిక తండ్రికి ఈ విషయం తెలిసి ఆమెను వెంటనే మోటారు సైకిల్‌పై జడ్డంగి పీహెచ్‌సీకు తరలించారు. నందినికి డాక్టర్‌ నాగార్జున ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రక్త పరీక్షలు, మెరుగైన చికిత్స కోసం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని నాగార్జున తెలిపారు. నాలుగు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతోందని, జ్వరం తగ్గడంతో ఈ రోజు బడికి వెళ్లిందని, ఇంతలో పాఠశాలలోనే తమ కుమార్తె కళ్లు తిరిగి పడిపోయిందని తండ్రి చక్రధర్‌ తెలిపారు. పాఠశాలలో తమ కుమార్తెను ఎవరూ పట్టించుకోక పోవడంతో తామే ఆసుపత్రికి తరలించామని బాలిక తల్లిదండ్రులు విలేకరుల వద్ద వాపోయారు. కాగా ప్రస్తుతం నందిని అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement