శోషల్‌ మీడియా | - | Sakshi
Sakshi News home page

శోషల్‌ మీడియా

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

‘బ్యాన్‌’ మాటల్లోనే..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా వినియోగాన్ని బ్యాన్‌ చేస్తామని ఈ ఏడాది మార్చి 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. నేటికి సరిగ్గా నెల రోజులు గడిచినా ఆయన చేసిన ప్రకటనపై ఏ మాత్రం ముందుకు వెళ్లింది లేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారు. ఎలా అమలు చేస్తారు. 13 ఏళ్లపై బడ్డ టీనేజర్ల పరిస్థితి ఏమిటి వంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

నియంత్రణ కరవు

సామాజిక మాధ్యమాలలో చోటు చేసుకుంటున్న కార్యకలాపాల నుంచి, కాల పరిమితి వరకు ఎటువంటి నియంత్రణ లేదు. చట్టపరంగా నియంత్రించే చర్యలు కూడా దాదాపుగా శూన్యమే. అరచేతిలో ఇమిడిపోతున్న సెల్‌ఫోన్‌ అందులో ఇంటర్నెట్‌ ఉన్నంత వరకు చిన్న పిల్లలు కూడా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు కూడా ఈ మత్తులోనే జోగుతుండడంతో పిల్లలకు మంచి చెప్పే పరిస్థితి లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్ట్రాగాం, సహా డేటింగ్‌ యాప్‌లు, అశ్లీల కంటెంట్‌తో రెచ్చిపోతున్న మరికొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు పూర్తిగా యువతను నిర్వీర్యం చేస్తున్నాయి.

వెర్రి తలలు వేస్తున్న సోషల్‌ మీడియా

బానిసలవుతున్న యువత, పిల్లలు

మానసిక, శారీరక అనారోగ్యాలు

ఆరు నెలల్లో 141 అనుబంధ నేరాలు

కాకినాడ క్రైం: ఓ యువతి వాట్సాప్‌ స్టేటస్‌లో ఎప్పటికప్పుడు తన ఫొటోలు పెట్టుకునేది. స్క్రీన్‌షాట్‌లు తీసి అశ్లీల మార్ఫింగ్‌కు పాల్పడ్డాడు ఓ యువకుడు. యువతి కుటుంబీకులు పోలీసుల్ని ఆశ్రయిస్తే స్టేటస్‌ నేనే కాదు చాలామంది చూసి ఉంటారు. మార్ఫింగ్‌ నేనే చేశానన్న గ్యారంటీ ఏంటి అంటూ సునాయాసంగా తప్పించుకున్నాడు.

● ఇన్‌స్ట్రాగాంలో వైరల్‌ అయిన ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌ను చూసి క్లిక్‌ చేసిన ఓ డీటీపీ ఆపరేటర్‌ తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.40 వేలు పోగొట్టుకున్నాడు.

● ఫేస్‌బుక్‌లో ఓ అకౌంట్‌ హోల్డర్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేయడంతో అతడిని ఫాలో అవుతున్న కాకినాడ యువకుడు బెట్టింగ్‌ యాప్స్‌లో జూదం మొదలు పెట్టాడు. గత ఐపీఎల్‌ సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు.

● తన ఇన్‌స్ట్రాగాం ఐడీకి వచ్చిన ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ని యాక్సప్ట్‌ చేసింది ఓ యువతి. కాకినాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో చదువుతున్న ఆమె తన స్నేహితులకు.. ఆకర్షణీయంగా ఉన్న యువకుడు తనకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడని చెప్పుకుంది. కొద్దిరోజుల పాటు స్నేహం నడిచేసరికి అసలు విషయం వెల్లడైంది. ఆ అకౌంట్‌ ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహించే ఓ గ్రూప్‌ అకౌంట్‌ అని, వారు ఇలా యువతులపై వలలు వేస్తూ వ్యభిచారంలోకి దించుతున్నారని తెలిసింది.

సోషల్‌ మీడియా ఒక మిథ్యా ప్రపంచం. ఎక్కడో ఉన్నవారిని దగ్గర చేస్తున్నానపించి పక్కనే ఉన్న అయిన వారిని దూరం చేస్తున్న ఓ సామాజిక సాధనం. కలలు, కల్పితాలు, షేర్లు, లైక్‌లు కామెంట్లే ఇంధనంగా మనల్ని మనకి కాకుండా చేసేస్తున్న డిజిటల్‌ బానిసత్వం. మునిగామా.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టింపు ఉండదు, మనం, మనవారు ఏమైపోతున్నా తల తిప్పం. ఏం పోస్ట్‌ చేద్దాం అన్న ఆత్రం, పోస్ట్‌ చేశాక ఎవరి స్పందన ఏంటన్న కుతూహలం. లైక్‌లు లేకపోతే తినం, షేర్‌లు లేకపోతే నిద్రపోం, నెగటివ్‌ కామెంట్లయితే జీర్ణించుకోలేం. ఆకాశం ఊడినట్లు, కూడనిది ఏదో జరిగినట్లు మనల్ని మనం కోల్పోతాం. ఇదీ సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం. మన ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన సోషల్‌ మీడియా వేదిక దుర్వినియోగం అవుతోంది.

ఇలా చేస్తే మేలు

● సోషల్‌ మీడియా వేదికల వినియోగం తప్పనిసరి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

● చిన్నపిల్లలను అనుమతించవద్దు

● ముందుగా నిర్దేశించుకున్న సమయం మేరకే యాప్‌లో ఉండాలి.

● యాప్స్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌ సెట్‌ చేసుకోవాలి.

● అకౌంట్‌ రిజిస్ట్రేషన్‌, వినియోగం వేళ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, ఫోన్‌ నంబర్లు, చిరునామా షేర్‌ చేయకూడదు.

● తెలియని వారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు యాక్సప్ట్‌ చేయవద్దు.

● నిద్రకు కనీసం గంటన్నర ముందు సోషల్‌ మీడియా, ఫోన్‌ వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.

● అకౌంట్లకి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. తరచుగా మార్చుతుండాలి. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

వ్యక్తిగత ఫొటోలు

పోస్ట్‌ చేయవద్దు

వాట్సాప్‌ స్టేటస్‌లో వ్యక్తిగత ఫొటోలు పెట్టడం, ఎక్కడికి వెళుతున్నాం. ఏం చేస్తున్నామో పోస్ట్‌ చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ సమాచారాల వల్ల దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మిగిలిన సోషల్‌ మీడియా వేదికల కంటే వాట్సాప్‌ స్టేటస్‌ మరింత వేగంగా చేరుతుంది. సైబర్‌ నేరాలకు గురైతే 1930కి డయల్‌ చేసి కంప్‌లైంట్‌ చేయాలి.

– గరికపాటి బిందుమాధవ్‌,

ఎస్పీ,

ఐడీలతోనే పరిచయాలు

నేటి తరంతో సోషల్‌ మీడియా ఓ ఆటాడుకుంటోంది. పరిచయ ప్రక్రియలు సమూలంగా మారిపోయాయి. మరీ దారుణంగా, ఒకరికొకరు నూతన పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు సొంత ఊరు, పేర్లతో పరిచయం చేసుకోవడం మానేశారు, ఎవరివి వారు సోషల్‌ మీడియా ఐడీలు చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటున్నారు. ‘పోటుగాడు’, ‘పంచ్‌ పటాక్‌’, ‘ఖతర్నాక్‌ కుర్రోడు’ , ‘బిల్డప్‌ బాబాయ్‌’, ‘ఆల్‌ ఇండియా అందగత్తె’ అంటూ ఒకటా రెండా చిత్ర విచిత్రమైన పేర్లు ఎన్నో వినిపిస్తున్నాయి. ఓ స్నేహితుడు తన స్నేహితుడికి మరో వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తున్నాయి.

ఎన్ని అనర్థాలో..

సామాజిక మాధ్యమాల వేదికగా అనేక నేరాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ మొత్తంలో నగదుతో పాటు కీలక డేటా చౌర్యానికి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతుల మాన, ప్రాణాలకు సోషల్‌ మీడియా వేదికలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి.

బెట్టింగ్‌ యాప్‌లు వీటి ద్వారానే ప్రమోట్‌ అవుతున్నాయి. పిల్లల చదువుపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. తీవ్ర మానసిక, శారీరక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. కాకినాడ జిల్లాలో సోషల్‌ మీడియా అఽనుబంధ నేరాలు నానాటికీ అధికమవుతున్నాయి. ఫొటోలు మార్ఫింగ్‌, ఖాతాలో డబ్బులు చోరీ, ఫేక్‌ అకౌంట్లు సృష్టి, ఖాతా హ్యాకింగ్‌ నేరాలపై గడచిన ఆరు నెలల్లో జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో 141 ఫిర్యాదులు అందాయి. వీటిలో పరిష్కారమైనవి ఏవీ లేవు. ఇటువంటి ఫిర్యాదులు అందుకునేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు లేవు. ముందుగా 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేసి కంప్‌లైంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే, ఆ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement