బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చైర్మన్, షేక్ ఖలీఫతుల్లా తెలిపారు. స్థానిక హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్ట్ రంగంలో కార్మికుల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, వారి హక్కులు, భద్రత, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పలు ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా అమలు స్థాయిలో తీసుకువెళ్లేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు, సామాజిక భరోసా కల్పించడం ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రగతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక స్థాయిలో కార్మిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పోర్టుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం పరస్పర అనుసంధానమైన అంశాలని, కార్మికుల సంక్షేమం బలోపేతం అయితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు. భవిష్యత్తులో కూడా కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరంగా కృషి కొనసాగిస్తామని ఖలీఫతుల్లా స్పష్టం చేశారు. ఫెడరేషన్ విస్తరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలోకి వంశీ కృష్ణను, జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను నియమించినట్లు ప్రకటించారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందించారు.


