● జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్
● ఘనంగ నివాళులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నేటి తరం యువతకు బాబూ జగ్జీవన్ రామ్ స్పూర్తిదాయకంగా నిలుస్తారని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం స్థానిక లేడీస్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. బిహార్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి తన స్వయంకృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని బాబూ జగ్జీవన్‌రామ్‌ను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు. వివిధ మంత్రి పదవులు చేపట్టి నవ భారత నిర్మాణం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రధానంగా భూసంస్కరణ ద్వారా దున్నేవాళ్ళకే భూమి మీద హక్కు కల్పించారన్నారు. వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికి గోధుమలు, ఇతర ఆహార దినుసులను దిగుమతి చేసుకునే మన దేశానికి స్వయం సమృద్ధితెచ్చారన్నారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే 1971లో పాకిస్తాన్ పై మన దేశం విజయం సాధించిందని, కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుందన్నారు. కేంద్ర మంత్రిగా పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, భవిష్యనిధి చట్టం వంటి ఎన్నో కార్మిక సంక్షేమ చట్టాలు తెచ్చారని, ఎయిర్ లైన్స్, రైల్వేల విస్తరణకు బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


