బాబుకు బుద్ధినివ్వు.. నాయుడిని గద్దె దింపు | - | Sakshi
Sakshi News home page

బాబుకు బుద్ధినివ్వు.. నాయుడిని గద్దె దింపు

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

● వేంకటేశా..

సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును పదవి నుంచి బర్తరఫ్‌ చేసి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ శనివారం వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు జిల్లా అంతటా పెద్ద ఎత్తున జరిగాయి. ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన కార్యక్రమాలు, ఆలయాల్లో పూజల్లో భాగస్వాములయ్యారు. టీటీడీ చైర్మన్‌ ఒక మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నారనే విధంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయినా చంద్రబాబు ఉదాసీనంగా ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు నిలదీశారు. ఇటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చినప్పుడు తన సచ్చీలత నిరూపించుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడవల్సిన పాలక మండలి చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఇటువంటి కార్యకలాపాలలో ఉన్నారని తెలిసి కూడా చంద్రబాబు తన వెంట బీఆర్‌ నాయుడును తిప్పుకోవడం సిగ్గు, సిగ్గు అంటూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నినాదాలు చేశారు. శనివారం కావడంతో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుని నుంచి కాకినాడ వరకు అన్ని నియోజకవర్గాల్లోను నిరసన ర్యాలీలు, చైర్మన్‌ నాయుడును వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరును ఎండగడుతూ ప్ల కార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. హిందువుల మనోభావాలు గాలికొదిలేసిన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు.

ప్ల కార్డులతో నిరసన

జిల్లాలోని తుని, కాకినాడ రూరల్‌, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆదేశాలతో కోటనందూరు మండలం కొట్టం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయుడును పదవి నుంచి తొలగించకపోవడంపై ఆలయం బయట ప్ల కార్డులతో నిరసన తెలియజేశారు.

కాకినాడ రూరల్‌

ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రమణయ్యపేట నుంచి ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ కాలనీలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తిరుమల పవిత్రను కాపాడు దేవుడా అని వేడుకున్నారు. ఆలయం బయట చైర్మన్‌ నాయడును తొలగించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి, గొడ్డు కొవ్వు కలిసిందని, తీవ్రమైన దుష్ప్రచారం చేశారని ద్వజమెత్తారు. తీరా అది తేలిపోయి ప్రజల్లో చులకన అయిపోయిన తరువాత ఇంకా టీటీడీని అపవిత్రం చేసే కార్యక్రమాలే చేస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్‌ నాయుడు వీడియోలు బయటకు వచ్చినా చంద్రబాబు ఎందుకు చర్యలకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తిరుమల, ఒంటిమిట్ట వెళ్లినా నాయుడు, చంద్రబాబు పక్కనే ఉండటం చూస్తుంటే వీరిది ఫెవికాల్‌ బంధమన్నట్టుగా ఉందన్నారు. టీటీడీ పవిత్రను కాపాడుతానని చెప్పిన చంద్రబాబు ఎందుకు నాయుడు విషయంలో మౌనంగా ఉన్నారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు స్వామి పవిత్రను కాపాడేందుకు ఎందకు ముందుకు రావడం లేదని వైఎస్సార్‌ సీపీ ప్రశ్నిస్తోందన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివ, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ(కిట్టు), మండల ఉపాధ్యక్షుడు రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ నాయకులు మాకినీడి శేషుకుమారి, మాజీ మేయర్‌ సరోజ పాల్గొన్నారు.

పిఠాపురం

పిఠాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు వంగా గీత ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాధించాలని గీత కోరారు. తప్పుడు విధానంలో వెళ్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడును వెంటనే తొలగించాలని గీత డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి రామారావు (బాబి), జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గంపేట

టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి నాయుడుని తప్పించాలని డిమాండ్‌ చేస్తూ జగ్గంపేట కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేట వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్‌ రాజా, పబ్లిసిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామకుర్తి జగాలు, సగర సంగం జిల్లా అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పెద్ద రాజబాబు పాల్గొన్నారు. గోకవరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, మండల అధ్యక్షుడు పార్టీ రాంబాబు, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి తోలేటి రాంప్రసాద్‌, నరాలశెట్టి నరసయ్య మాట్లాడుతూ టీటీడీ పవిత్రతను అపవిత్రం చేస్తున్న చైర్మన్‌ నాయుడుని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

పెద్దాపురం

టీటీడీ చైర్మన్‌ నాయుడును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్‌ సామర్లకోట–పెద్దాపురం రోడ్డులో ఉన్న పాండురంగ స్వామి ఆలయంలో కార్యకర్తలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని పూజలు నిర్వహించారు. పాండురంగ స్వామి ఆలయ సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి దొరబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియోలు బయటకు వచ్చినా పాలక మండలి చైర్మన్‌ను తొలగించకుండా, అతనిని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నాయకులు ఆక్షేపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గౌరసాన సూరిబాబు, ఎంపీపీలు బి.సత్తిబాబు, మిరియాల లోవరాజు, ఎస్‌ఈసీ సభ్యుడు గోపు మురళి పాల్గొన్నారు.

ప్రత్తిపాడు

టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు కలియుగదైవమైన వేంకటేశ్వరస్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి పద్మావతి అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట ప్లకార్డు ప్రదర్శించి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుని సస్పెండ్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమ్మీలు, జెడ్పీటీసీ సభ్యులు బెహరా రాజరాజేశ్వరి, గొల్లు చిన్న దివాణం, పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా, బెహరా దొరబాబు, బదిరెడ్డి గోవింద్‌ పాల్గొన్నారు.

జగ్గంపేటలోని రాజగోపాలస్వామి ఆలయంలో

ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి తోట నరసింహం, పార్టీ నేతలు

ఉత్తరకంచి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు

తిరుమల పవిత్రతను కాపాడు స్వామీ

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును

బర్తరఫ్‌ చేయాలంటూ

ఆలయాల్లో పూజలు

జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు

నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నేతలు,

కార్యకర్తలు

స్వచ్ఛందంగా తరలివచ్చి

నిరసనల్లో పాల్గొన్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement