బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలో ప్రభుత్వానికి చెందిన మూడున్నర ఎకరాల స్థలాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కానుకగా ఇవ్వడం కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణమని, ఆ స్థలంలోనే ఆయుష్ మెడికల్ కళాశాల నిర్మించాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన పక్కనే ఆ కళాశాల నిర్మించి ఆసుపత్రిని అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్‌లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని, మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించిన రూ.175 కోట్లకు పైగా విలువ చేసే మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం టూరిజం శాఖ పేరుతో ఎస్వీఎస్‌ఎన్ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెడుతున్నట్లు ఒక జీవోను విడుదల చేసిందన్నారు. ఎటువంటి వివరాలు లేకుండా ప్రజలను మాయ చేసే విధంగా ఈ జీవోను విడుదల చేసిందన్నారు. మూడున్నర ఎకరాల భూమిని వర్మకు తాజ్ హోటల్ పేరుతో కట్టబెట్టే విధంగాను, అక్కడ నిర్మాణం చేయనున్న మెడికల్ కళాశాలను పిఠాపురంలోని పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చిన చోట నిర్మాణం చేసేందుకు చీకటి ఒప్పందాలు జరగనున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలియజేశారు. ఉన్న ఐదు ఎకరాల్లో ఇప్పటికి 240 మందికి పట్టాలు ఇచ్చారని, మిగిలిన వారికి కూడా పట్టాలిచ్చి ఆ భూమి అక్కడ పేదలకే ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వ భూమి ఇస్తే మాత్రం అటు న్యాయస్థానంలోనూ ఇటు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం తరుణంలో వైద్యం పేదలకు అందడం లేదని, కాకినాడకు ఆయుర్వేద కళాశాల రావడం శుభ పరిణామన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన చోటే కళాశాలను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖ నిబంధనలను అనుసరించి ఆసుపత్రి, కళాశాల ఒకే చోట ఉండాలని చెప్పారు. విశాఖలో ఎకరం భూమిని 99 పైసలకు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కట్టబెడుతోందని చెప్పారు. అమరావతిలో లక్ష ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం సేకరిస్తున్నారని, అక్కడ 99 పైసలకు భూమిని కేటాయించగలరని కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఈశ్వరయ్య ప్రశ్నించారు. వర్మకిచ్చిన భూమిని రద్దు చేయాలని లేనిపక్షంలో అమరావతిలో ఈ సమస్యలపై భారీ ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని ఈశ్వరయ్య హెచ్చరించారు.
õ³§ýlÌS ¯øsZÏ Ð]l$sìæt Möyýl$-™èl$-¯é²Æý‡$ : ˘
మాజీ మంత్రి కన్నబాబు
చంద్రబాబు తన పార్టీ వారి కోసం కాకినాడలో స్థలం ఇస్తున్నాడని, పిఠాపురంలో పేదలకు ఇచ్చిన స్థలంలో ఈ కళాశాల నిర్మించి పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. లేని కంపెనీలకు ప్రభుత్వ భూములను తన వారి కోసం కారు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ఈ ఉద్యమానికి వైస్సార్ సీపీ తన వంతుగా సహకరిస్తుందన్నారు. 99 పైసలకు ఎకరం భూమిని లీజికిస్తున్న చంద్రబాబు.. తన హెరిటేజ్ కంపెనీలో ఒక్క చాక్లెట్ కూడా ఆ ధరకు ఇవ్వరని చెప్పారు.
భూమిని ధారాధత్తం చేయడం తగదు : మాజీ ఎంపీ గీత
మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ తమ హయాంలో ఆయుష్ కళాశాలకు స్థల సేకరణ కోసం కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ ఎంపిక చేశామన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. ఒక వ్యక్తి కోసం విలువైన భూమిని ధారాధత్తం చేయడం తగదని గీత సూచించారు. దీనిపై పోరాటం చేసేందుకు తమ పార్టీ శ్రేణులు సహకరిస్తాయని గీత తెలిపారు. ప్రముఖ న్యాయవాది జవహర్ ఆలీ మాట్లాడుతూ కాకినాడ ప్రశాంతమైన సిటీ అని ఇక్కడ భూమికి విలువ ఉంటుందని అలాంటి విలువైన భూములను ఒక వ్యక్తి సొంతం కోసం టూరిజం శాఖ అప్పనంగా ఇచ్చిందని అన్నారు. తాజ్ హోటల్ పేరుతో వర్మ ప్రజలను మోసం చేస్తున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ నేత నరాల శివ, బీఎస్పీ నేత సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య


