జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కేశవరావు
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీఈఏపీ సెట్ రాసే విద్యార్థుల కోసం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వి.కేశవరావు పేర్కొన్నారు. కళాశాలలో శనివారం కంప్యూటర్ ల్యాబ్‌లో మెటీరియల్ విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తోడైతే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడగలరన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు మాట్లాడుతూ కళాశాల పూర్వవిద్యార్థులు కర్రిభామిరెడ్డి, వైఎస్‌ఎన్ చొరవతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా డాక్టర్ వంగూరి చిట్టెన్, అభ్యదయ ఫౌండేషన్, పైడా చారిటబుల్ ఆర్గనైజేషన్, ఎస్‌ఆర్‌ఏంటీ సంస్థల సహకారంతో 20 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ ఏపీఈఏపీసెట్‌తో పాటు నీట్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నామని, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పహార సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్ట్స్ విద్యార్థుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యూట్), లాసెట్ కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇతర వివరాలకు కన్వీనర్ పీ.వీ.కృష్ణ 98493 76980, బాలకృష్ణ 83286 56065 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
కొడుకుపై తండ్రి ఘాతుకం
● అట్లకాడ కాల్చి ముఖంపై వాతలు
ప్రత్తిపాడు రూరల్: మానవత్వాన్ని మరిచిన అతను కన్న కొడుకు ముఖంపై అట్లకాడ కాల్చివాతలు పెట్టి తండ్రి స్థానానికే మచ్చ తెచ్చిన ఘటన ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఏడేళ్ల నిహాల్ ఆటలాడుకుంటూ ఇంటి సమీపలోని వేరే వ్యక్తికి చెందిన ఆటో షీట్ కవర్‌ను కోసి ధ్వంసం చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న తండ్రి పెండ్యాల చంద్రయ్య గాఢనిద్రలో ఉన్న కన్న కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో అట్లకాడను కాల్చి ముఖంపై వాతలు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన నిహాల్‌ను కుటుంబ సభ్యులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్థానంలో ఉన్న చంద్రయ్య మందలిస్తే పోయేదానికి చిత్రహింసలు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నేటి నుంచి తలుపులమ్మ పుట్టింటి సంబరాలు
తుని రూరల్: లోవ తలుపులమ్మ పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరులో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. 13 రోజులు నిర్వహించే ఈ సంబరాలు చివరి రోజు అమ్మవారి ఊరేగింపు, భక్తుల దర్శనాలు, తీర్థంతో ముగుస్తాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ కొత్తూరు గ్రామంలో ఉన్న ఉపాలయం వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో జాతరోత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, బాణ సంచా పేలుళ్లు, తదితర భారీ ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి పుట్టింటి సంబరాలు కావడంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉపాధి, ఉద్యోగాలు చేసుకునే కుటుంబీకులు, ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవకొత్తూరు వచ్చి గంధామావాస్య, అమ్మవారి జాతరోత్సవాలలో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులతో సమావేశం నిర్వహించామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. మొదటి రోజు ఆదివారం వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తారు.


