పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకోం

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మసీదు మాన్యంలో ఇళ్లు నిర్మించాలి

ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటాం

లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత

పిఠాపురంలో లబ్ధిదారులతో కలిసి

ఆందోళన, భారీ ర్యాలీ

పిఠాపురం: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని పిఠాపురం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత తెలిపారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ కోసం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు

కేటాయించిన పిఠాపురం మసీదు మాన్యంలో ఆయుష్‌ కళాశాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఆమె ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నేతలు లబ్ధిదారులకు అండగా ఆందోళన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఇచ్చిన స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నర్సింగపురంలో జగనన్న కాలనీలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే పట్టాలిచ్చిన లబ్ధిదారులకు రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో ఆయుష్‌ ఆసుపత్రి నిర్మించిన స్థలానికి పిఠాపురంలో మసీదు మాన్యం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఈ విషయాన్ని పక్కనపెట్టి తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా చూపించారని ఆరోపించారు. మెడికల్‌ కాలేజీలు ఆస్పత్రులకు దగ్గరలోనే ఉండాలన్న నిబంధనను కూడా మర్చిపోయారన్నారు. తెలుగుదేశం నేతకు అక్కడ స్థలాన్ని కట్టబెట్టడం కోసమే ఇక్కడ పేదలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నేతకు కేటాయించాలనుకుంటే చాలా స్థలాలు ఉన్నాయని, నిరుపేదలకు స్థలాలను ఆక్రమించుకోవడం దారుణం అన్నారు.

వైఎస్సార్‌ సీపీకి పేరు వస్తుందన్న అక్కసుతోనే..

వైద్య కళాశాల ఆసుపత్రి పక్కనే ఉండాలన్న నిబంధనను పక్కన పెట్టి దూరంగా ఉన్న పేదల స్థలాలను ఉన్నతాధికారులు రికమండ్‌ చేయడం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తే వైఎస్సార్‌ సీపీకి పేరు వచ్చేస్తుంది అన్న అక్కసుతో కావాలని పేదల స్థలాలను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. నిరుపేదలకు కేటాయించిన జగనన్న కాలనీలను అడ్డుకుని వారి నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే నేతలు అందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ పునరాలోచించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. పిఠాపురం మసీదు మాన్యంలో కొద్ది సేపు ఆందోళన నిర్వహించిన అనంతరం లబ్ధిదారులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి పాడా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పచ్చిమళ్ల జ్యోతి, ఉలవల భూషణం, బత్తుల సాయిరాం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, సోమరౌతు లలిత, పలువురు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement