● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు సూర్యనారాయణ
● తండ్రి చేతిలో దాడికి గురైన బాలుడికి జీజీహెచ్‌లో పరామర్శ
కాకినాడ క్రైం: తండ్రి చేతిలో దాడికి గురై చావు అంచుల వరకు వెళ్లి ఆసుపత్రి పాలైన ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పెండ్యాల నిహాల్‌ను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు మందాల గంగా సూర్యనారాయణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మితో కలిసి సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పక్కింటి వారి ఆటో సీటు కవర్ చింపాడని చెప్పడంతో తండ్రి చంద్రయ్య శనివారం తాగి వచ్చి బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడన్నారు. ఇనుప ఊచతో కొట్టి అట్ల కాడ కాల్చి శరీరంపై అంటించాడని తెలిపారు. బాలుడి ఆర్తనాదాలు చేస్తూ ఇంట్లో పడిపోయి రాత్రంతా చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుండగా ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి బాలుడిని రక్షించారన్నారు. తండ్రి చంద్రయ్య అప్పటికే పరారయ్యాడని, స్థానిక ఆసుపత్రికి చేర్చగా మెరుగైన వైద్యం కోసం ఆదివారం కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని తెలిపారు. చంద్రయ్యపై ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశామని సూర్యనారాయణ అన్నారు. బాలుడి కడుపులో రక్తస్రావం అయిందని వైద్యులు తెలిపారని చెప్పారు. పిల్లల్ని హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాలుడిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బాలుడి సంరక్షణ బాధ్యతలు డీసీపీవో వెంకట్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ విభాగం చేపడుతుందని అన్నారు. బాలుడిని పరామర్శించిన వారిలో పీడీ, డీసీపీవోల సహా జిల్లా బాలల పరిరక్షణ అధికారులు కె.శ్రీనివాసరావు, కె.విజయ ఉన్నారు.


