రాజానగరం: కానవరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జ్ డీఎస్పీ బి.రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కానవరం గ్రామంలో కోరాడ శివలక్ష్మి ఇరవై ఏళ్లుగా తన కుమార్తెతో కలసి ఉంటుంది. అదే గ్రామంలోని జీడిపప్పు ఫ్యాక్టరీలోకి ఆమె కూలికి వెళ్తుండగా, కుమార్తె రాజమహేంద్రవరంలోని ఓ నగల దుకాణంలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో గత నెల 25న ఉదయం ఇంటికి తాళం వేసి, ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన శివలక్ష్మి తాళం వేసిన తలుపులు తీసి ఉండటాన్ని గమనించి కంగారుగా లోనికి వెళ్లి చూస్తే బీరువా కూడా తెరిచి ఉంది. అందులోని 82.5 గ్రాముల బంగారు నగలు, 45 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రల ఆధారంగా చోరీకి పాల్పడిన ముద్దాయి జామ వీరగణేష్‌ని కాకినాడలో అరెస్టు చేశారు. అతడి నుంచి దొంగిలించిన నగల్లో 75.8 గ్రాముల బంగారం, 253.80 గ్రాముల వెండి వస్తువులను స్వాధీన పర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు నారాయణమ్మ, జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


