దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Mar 9 2026 7:32 AM | Updated on Mar 9 2026 7:32 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రౌతులపూడి: మండలంలోని ఎస్‌.పైడిపాల ఆర్‌అండ్‌బీ రోడ్డులో గుమ్మరేగుల వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్‌.పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరహాలు (45) మండలంలోని బీబీ పట్నంలో శనివారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి స్కూటీపై స్వగ్రామం ఎస్‌.పైడిపాల వెళ్తూండగా.. గుమ్మరేగుల వద్ద ఎదురుగా రౌతులపూడి వైపు వస్తున్న ఎర్రమట్టిని లారీ వేగంగా దూసుకువచ్చి, అతడిని బలంగా ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన వరహాలు తలపై నుంచి లారీ చక్రాలు దూసుకుపోయాయి. దీంతో, తల నుజ్జునుజ్జయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రౌతులపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వరహాలు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు వరహాలుకు భార్య రామలక్ష్మి ఉన్నారు.

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

శంఖవరం: కత్తిపూడి వద్ద పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడికి చెందిన బోడపాటి త్రిమూర్తులు (50) ఆదివారం రాత్రి నెల్లిపూడి జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన బానుబోయిన స్వామి మోటార్‌ బైక్‌పై చెందుర్తి నుంచి అన్నవరం వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న త్రిమూర్తులును అతడు బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌పై ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు త్రిమూర్తులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి మృతదేహం వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 3,200 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది.

ఇంటర్‌ ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

కాకినాడ రూరల్‌: కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఈఈటీ) నిర్వహకులు ఎం.కూర్మారావు, ఎన్‌.పెద్దిరాజు, ఎన్‌.ఏసుదాస్‌, ఎన్‌.చిన్నారావు, ఎల్‌.జార్జి, సుజ్ఞాన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కృషితో లబ్ధి పొంది, ఆయన ఆశయం ‘సే బ్యాక్‌ టు సొసైటీ’ సాధనకు ఈ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26లో పదో తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ–సి కేటగిరీల విద్యార్థులు ప్రీ ఫైనల్‌ పరీక్షలో 500 పైగా మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించారు. వీరికి వివిధ కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్‌ విధానంలో జేఈఈ/ఐఐటీ, నీట్‌ విభాగాల్లో ఉచితంగా ఇంటర్‌ చదివించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి ప్రీ ఫైనల్‌ మార్కులు జాబితా జత చేయాలని సూచించారు. ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్‌ 2న రాజమహేంద్రవరంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 99595 07507, 93940 78228 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement