భాగ్యలక్ష్మీ ఆటో సర్వీస్‌ | - | Sakshi
Sakshi News home page

భాగ్యలక్ష్మీ ఆటో సర్వీస్‌

Mar 8 2026 7:30 AM | Updated on Mar 8 2026 7:30 AM

పట్టుదల ఉంటే పరాజయాలు ఆమడ దూరం పరుగెడతాయి. విజయాలు పలకరిస్తాయి. కన్నీరు పెట్టుకుంటే కడుపు నిండదు. ఈ సూత్రాన్నే నమ్ముకున్నారు యు.కొత్తపల్లి మండలం గోర్స గ్రామానికి చెందిన జి.భాగ్యలక్ష్మి. భర్త, ఇద్దరు పిల్లలు బేబీ సౌమ్య (14), అఖిల్‌ కుమార్‌(12)లతో జీవితం ఆనందంగా సాగిపోయేది. ఉన్నట్టుంది పెద్ద కుదుపు. విధి వక్రించి, కుటుంబ భారాన్ని మోసే భర్త దూరమయ్యాడు. కుటుంబ భారం ఆమె పైనే పడింది. ఎదురొచ్చిన కష్టాన్ని ఆమె గుండెల్లోనే దాచుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లి, ఒక బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పని చేశారు. విధి మరోసారి పరీక్ష పెట్టింది.

హైదరాబాద్‌లో పని చేస్తూండగా కాలు జారి మెట్ల మీద నుంచి పడిపోయారు. కాలు విరిగిపోవడంతో రాడ్లు వేశారు. దీంతో, ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. బ్యూటీషియన్‌ పనిలో ఎక్కువ సమయం నిలబడి ఉండాలి. దీంతో, ఆ పని చేయలేక అక్కడి నుంచి భాగ్యలక్ష్మి సొంతూరు గోర్స వచ్చేశారు. కుటుంబం గడవడానికి ఆటో నడపడం నేర్చుకున్నారు. ఎలక్ట్రిక్‌ ఆటో అయితే కాలుతో ఎక్కువగా పని ఉండదు. అందుకే ఈ–ఆటో కొనుక్కుని స్వశక్తితో బతుకు బండిని నడిపించుకుంటున్నారు. ఆటోలు ఎక్కువగా పురుషులే నడుపుతూంటారు. ఈ రంగంలోకి వచ్చినప్పుడు మొదట్లో కొందరు హేళన చేశారు. మరికొందరు వెకిలిగా, సూటిపోటి మాటలు మాట్లాడేవారు. ఇవేవీ పట్టించుకోకుండా పట్టుదలతో ఆమె ముందకు సాగడం చూశాక అందరూ సహకరించసాగారు. వర్తమాన పరిస్థితుల్లో జరుగుతున్న వివిధ సంఘటనలను చూస్తున్న మహిళలు.. మగవారు లేకుండా ఆటోలో ప్రయాణించడానికి ఒకింత భయపడుతూంటారు. రాత్రి వేళల్లో అయితే ఈ భయం మరింతగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడి మహిళలకు భాగ్యలక్ష్మీ ఆటో సర్వీస్‌ ఒక వరంగా మారింది. ఆమె ఆటో ఎక్కితే ధైర్యంగా గమ్యం చేరుకోవచ్చని మహిళలు చెబుతూంటారు. ‘చిన్నప్పుడు సైకిల్‌ తొక్కడానికే భయపడేదానిని. ఇక ఆటోలు ఎక్కి ప్రయాణం చేయాలంటే దిగే వరకూ ఊపిరి బిగబట్టి ఉండేదానిని. అలాంటిది ఆ ఆటోనే నా కుటుంబానికి జీవనాధారం అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలను నేనే చూసుకోవాలి. నా పిల్లల భవిష్యత్తు కన్నా వేరేదీ ముఖ్యం కాదనుకుని ముందుకు సాగుతున్నాను’ అని భాగ్యలక్ష్మి గర్వంగా చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement