వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురి నియామకం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ వివిధ కమిటీల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ వివరాలు తెలిపింది. వివిధ పదవుల్లో నియమితులైన వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అభినందనలు తెలిపారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కడియాల మహాలక్ష్మి (చినబాబు) (కాకినాడ రూరల్), పార్టీ జిల్లా ఆర్గనైజనల్ కార్యదర్శిగా బొంతు లీలాకృష్ణ (కాకినాడ రూరల్), ఇంటలెక్చువల్ ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షులుగా అల్లు సూర్య సత్యనారాయణ (ప్రత్తిపాడు), బీర డానియేల్ రాయ్ (కాకినాడ రూరల్) నియమితులయ్యారు. సోషల్ మీడియా వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పబ్బినీడి చైతన్య, సోషల్ మీడియా వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నవరపు రాజేష్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దోని శ్రీనివాస్, దివ్యాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దంతులూరి సాహిత్‌వర్మ(కాకినాడ రూరల్)లను నియమించారు. ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శులుగా రాచర్ల రమేష్ (ప్రత్తిపాడు), సవరపు చిట్టిబాబు, పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా కొల్లా భాస్కర్, వైఎస్సార్ టీయూసీ జిల్లా కార్యదర్శిగా నందిపాటి ఆదినారాయణ (కాకినాడ రూరల్), పబ్లిసిటీ వింగ్ జిల్లా కార్యదర్శిగా పులపకూర వీర్రాజు నియమితులయ్యారు.
వరకట్నం తీసుకోవడం,
ఇవ్వడం నేరం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వరకట్నం ఇవ్వడం, డిమాండ్ చేయడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని, వరకట్న వేధింపులు, హింస, మరణాలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. వరకట్న వేధింపు బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు పోలీస్ సంరక్షణ, న్యాయ సహాయాలు సత్వరం అందించాలని సూచించారు. వరకట్న రహిత వివాహాలను ప్రోత్సహించాలన్నారు. వరకట్నానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఓటర్లుగా
నమోదు కావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పద్దెనిమిదేళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.రామ్మోహనరావు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


