ఆడుకున్న మృత్యువు
ఘటనకు కారణాలు ఇలా..
ఒక టీచర్‌తో నడుస్తున్న ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ మొత్తం 20 విద్యార్థులు ఉండగా, శుక్రవారం 19 మంది హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని పార్కులో పునాది నిర్మించకుండానే నేలపైనే సిమెంట్ బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటికి సపోర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్, తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, సర్పంచ్ దంగేటి అన్నవరం, ఎంపీటీసీ పల్లి మోషే తదితరులు పరిశీలించారు. శ్రీకాకుళంలో ఉన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాదంపై ఆరా తీసి, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
ఫ సిమెంట్ జింక బొమ్మ పడి చిన్నారి మృతి
ఫ జి.పెదపూడి పాఠశాల ఆవరణలో ఘటన
పి.గన్నవరం: నవ్వుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అభం శుభం తెలియని ఆ పసిప్రాయం అనంత లోకాల్లో కలసిపోయింది.. పాఠశాల ఆవరణలో సిమెంట్ ఆట బొమ్మపై ఆడుకుంటూ దిగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని అశువులు బాసింది.. పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన దివి దుర్గా వరప్రసాద్‌కు, జి.పెదపూడికి చెందిన సుజాతతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే దుర్గా వరప్రసాద్, సుజాతలు జీవనోపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు. వారి ఇద్దరి పిల్లలను జి.పెదపూడి గ్రామంలోని వరప్రసాద్ అత్తయ్య అధికారి సత్యవతి ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. జి.పెదపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సత్యవతి చాలాకాలం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట పనిచేస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఆ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకుంటున్నారు. తేజశ్రీ ఐదో తరగతి, జాహ్నవి (7) రెండో తరగతి అభ్యసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జాహ్నవి పాఠశాల ఆవరణలోని పార్కులో సిమెంట్ జింక బొమ్మపై ఎక్కి నవ్వుతూ కొంతసేపు ఆడుకుంది. అనంతరం కిందకు దిగుతుండగా జాహ్నవిపై ఆ బొమ్మ పడిపోయింది. సుమారు 70 కిలోల బరువున్న బొమ్మ ఆమె ఛాతిపై పడడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాఠశాల హెచ్‌ఎంతో పాటు, స్థానికులు ఆ చిన్నారిని అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
అప్పుడే భోజనం తినిపించా..
అప్పుడే భోజనం తినిపించా.. సరదాగా నవ్వుతూ ఉంది.. కొద్ది సేపటికే ఇలా జరిగిందంటూ జాహ్నవి మృతితో అమ్మమ్మ సత్యవతి బోరున విలపిస్తోంది. ఈ ఘటనతో జి.పెదపూడి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంక్రాంతి పండగలకు ఇక్కడకు వచ్చిన జాహ్నవి తల్లిదండ్రులు రెండు రోజుల కిందటే తిరిగి విజయవాడకు వెళ్లారు. ఈ ఘటనపై పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆడుకున్న మృత్యువు
ఆడుకున్న మృత్యువు


