రైతు సేవకు షాక్
● గతంలో 394 ఆర్‌ఎస్‌కేలు
● నేడు 327కు కుదింపు
● జిల్లాలో 67 కేంద్రాలకు మంగళం
● రేషనలైజేషన్ పేరిట సిబ్బంది సర్దుబాటు
● ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేశానికే ఆదర్శవంతంగా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకే) ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ రైతులకు షాక్ ఇస్తోంది. రైతులకు ఉన్న ఊళ్లోనే అన్ని రకాల సేవలూ అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విత్తు నుంచి ఎరువులు, పంట విక్రయాల వరకూ రైతులకు తోడుగా నిలవడంతో పాటు సాగుకు సంబంధించి అడుగడుగునా సూచనలు, సలహాలు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక ఆర్‌బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్‌ఎస్‌కే) మార్చారు. ఆర్‌బీకేలకు రైతుల్లో మంచి ఆదరణ లభించడంతో వీటి మనుగడను ఏదో ఒక విధంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తగినట్టుగానే రేషనలైజేషన్ పేరిట పదుల సంఖ్యలో ఆర్‌ఎస్‌కేలను కుదించారు. చాలావాటికి అడ్రస్ లేకుండా చేశారు. అక్కడితో ఆగకుండా ఆ కేంద్రాల్లో సిబ్బందిని కూడా తగ్గించేశారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుదించారిలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 394 ఆర్‌బీకేలను ఉండేవి. రేషనలైజేషన్ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు ఆర్‌ఎస్‌కేలను ఒకటిగా విలీనం చేసింది. ఈవిధంగా జిల్లాలో 67 ఆర్‌ఎస్‌కేలకు మంగళం పాడటంతో వాటి సంఖ్య 327కు పడిపోయింది. వీటిలో 305 గ్రామీణ, మరో 22 అర్బన్ కేంద్రాల్లో ఉన్నాయి. వీటిల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ల(వీహెచ్‌ఏ)తో పాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది రైతులకు సేవలందిస్తున్నారు. వీరిలో కొందరు పదోన్నతులపై వెళ్లగా మరి కొంత మంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం సుమారు 330 మంది మాత్రమే ఆర్‌ఎస్‌కేలలో సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో ఆర్‌ఎస్‌కేకు 1,400 హెక్టార్ల వ్యవసాయ భూమిని పరిధిగా నిర్దేశించారు. ఈ పరిధిలో వీఏఏ, వీహెచ్‌ఏలు పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ప్రతి ఆర్‌ఎస్‌కేలో వీరిలో ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో సేవలు సరిగ్గా అందడం లేదని రైతులు వాపోతున్నారు.


