బాలల పరిరక్షణకు పటిష్ట చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బాలలతో భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన మిషన్ వాత్సల్య, జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. బాలలతో ఎక్కడా భిక్షాటన జరగకుండా చూడాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఒక మాఫియాగా ఏర్పడి బాలలతో భిక్షాటన చేయిస్తున్నారన్నారు. భిక్షాటన ముసుగులో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారని, అటువంటి వారిపై పోలీసు శాఖ ద్వారా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించి, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసుకుని విధిగా డ్రైవ్‌లు నిర్వహించాలని అన్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098పై విస్తృత ప్రచారం చేయాలని, అన్ని సినిమా హాళ్ల వద్ద దీనిని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైల్డ్ కేర్ హోమ్‌లోని బాల బాలికలకు అందుతున్న వసతులపై నివేదిక స మర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ సత్యనారాయణ, జి ల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభించి, పూర్ణాహుతి గావించారు. అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, నివేదనలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితుడు సూర్యనారాయణ, వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు తదితరులు హోమం నిర్వహించారు. 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో స్వామివారి దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు నరసింహమూర్తి ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు చేశారు.
26న పీజీఆర్‌ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశామని పేర్కొన్నారు.


