పొంచి ఉన్న మంచు ముప్పు
కాకినాడ క్రైం: కొద్ది రోజులుగా జిల్లాను పొగమంచు కమ్ముకుంటోంది. గడచిన వారం రోజులుగా ఇది మరింత ఉధృతమైంది. ఈ వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశాలున్నందున పోలీస్ శాఖలోని రహదారి భద్రతా విభాగం అప్రమత్తమైంది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పొగమంచులో ప్రయాణాలు సాగించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గత ఏడాది ఇదే సీజన్‌లో పొగమంచు కారణంగా జిల్లావ్యాప్తంగా 32 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మొత్తం 18 మంది మృత్యువాత పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కనిపించక వాటి పైకి దూసుకెళ్లిన సంఘటనలే ఎక్కువ. హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు వేయకుండా వాహనాలపై వేగంగా పయనించడమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు గుర్తించారు. దీనికితోడు జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌స్పాట్లు సహా పలు ప్రధాన రహదారుల్లో హైమాస్ట్ లైట్లు లేవు. దీంతో, మంచుతెరలతో రోడ్లపై అలముకుంటున్న చీకట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తగినన్ని లైట్లు ఏర్పాటు చేయాలని హైవే అథారిటీకి జిల్లా పోలీస్ శాఖ అనేకసార్లు లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు.
ఈ జాగ్రత్తలు మేలు
ఫ దట్టమైన పొగమంచులో రోడ్డు, మలుపులు, ముందు వెళ్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించవు. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువలన పొగమంచులో ప్రయాణాలు సాగించే వారు తమ వాహనాలను తక్కువ వేగంలో నడపాలి.
ఫ లో బీమ్ హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలి.
ఫ ముందు వెళ్తున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి.
ఫ మంచు కురిసి, తేమగా ఉన్న రోడ్డుపై అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనం అదుపు తప్పే ప్రమాదంతో పాటు, వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంటుంది.
ఫ మంచులో లేన్ డిసిప్లేన్ తప్పనిసరిగా పాటించాలి. రోడ్లపై గీతలు, సూచికలను అనుసరిస్తూ నిబంధనల ప్రకారం వాహనం నడపాలి.
ఫ పొగమంచులో ఓవర్ టేకింగ్ ప్రమాదాలకు కారణమవుతుంది. మలుపులు, బ్రిడ్జిలు, హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద తేలికగా హారన్ కొట్టాలి.
ఫ విండ్ షీల్డ్, వైపర్లు, లైట్లు తరచుగా శుభ్రపరుచుకోవాలి. వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
ఫ పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాలు వాయిదా వేయడం అత్యుత్తమం.
ఫ ద్విచక్ర వాహనదారులైతే తప్పనిసరిగా హెల్మెట్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించే వాహనం నడపాలి.
ఫ అలసట, మత్తులో ఉండగా పొగమంచులో వాహనం నడపకూడదు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మానవ తప్పిదాలే. అయితే ప్రకృతి అననుకూలత కూడా పలుమార్లు ప్రమాదాలకు కారణమవుతుంది. పొగమంచు వల్ల చోటు చేసుకునే ప్రమాదాలు ఈ కోవకే వస్తాయి. ఈ ప్రమాదాలను నియంత్రించడం, నివారించడం సాధ్యమే. దట్టమైన పొగమంచులో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని తగ్గిస్తున్నాం. తెల్లవారుజామున 3.30 నుంచి 6.30 గంటల వరకూ చోదకులకు ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ.. పొగమంచులో ప్రయాణించవద్దని సూచిస్తున్నాం. పొగమంచు అధికంగా ఉన్నందున ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో ప్రయాణాలు చేయకపోవడమే మేలు.
– బిందుమాధవ్ గరికపాటి, ఎస్‌పి, కాకినాడ జిల్లా
ఫ ఆ సమయంలో
రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం
ఫ ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం
ఫ జాగ్రత్తలు
తీసుకోవాలంటున్న పోలీసులు
పొంచి ఉన్న మంచు ముప్పు
పొంచి ఉన్న మంచు ముప్పు


