
డి.పోలవరంలో యూరియా కష్టాలు
తుని రూరల్: మండలంలోని డి.పోలవరంలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గత్యంతరం లేక తమ పంటల సంరక్షణకు అదనపు ధర చెల్లించి, కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 2,200 ఎకరాల్లో సాగవుతున్నాయి. వ్యవసాయ శాఖ సకాలంలో యూరియా అందించలేదు. ఇటీవల డిమాండ్‌కు అనుగుణంగా రైతు సేవా కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు. రైతులను గుర్తించి యూరియా విక్రయించాల్సి ఉండగా, మొదట్లో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ యూరియా ఇచ్చారు. ఈ విధానంపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బయోమెట్రిక్‌తో ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. గ్రామానికి యూరియా వచ్చిందని తెలిస్తే రైతులందరూ ఒక్కసారిగా ఎగబడుతున్నారు. అధికార పార్టీ నాయకులకు అడిగినన్ని ఇస్తూండగా, ఎన్ని ఎకరాలున్నా తమకు ఒమ్క బస్తా మాత్రమే ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో, ఖరీఫ్‌లో యూరియా ఆవసరాలు తీర్చుకునేందుకు బ్లాక్‌లో అదనంగా చెల్లించాల్సి వస్తోందని, రూ.270 బస్తాకు బ్లాక్‌లో రూ.450 నుంచి రూ.500 చెల్లిస్తున్నామని వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులు తీసుకువెళ్లిన యూరియా బస్తాలనే అదనపు ధరకు విక్రయిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో పలుకుబడి కలిగిన నాయకుడి సూచనలతో అక్రమార్కులకు అడిగినన్ని బస్తాలు ఇస్తూండటంతో సాగుదారులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. ఈ అక్రమాలను అరికట్టి, సాగు భూమి ఆధారంగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మండల వ్యవసాయాధికారి అశోక్ కుమార్‌ను వివరణ కోరగా, డిమాండ్‌కు అనుగుణంగా యూరియా రప్పిస్తున్నామని, ఇప్పటి వరకూ 80 టన్నులు అందుబాటులో ఉంచామని చెప్పారు. సిఫారసులతో ఎవ్వరికీ అదనంగా యూరియా ఇవ్వలేదని, పారదర్శకంగానే రైతులందరికీ యూరియా అందిస్తున్నామని అన్నారు.