
రోడ్డుపై కూలిన భారీ వృక్షం
స్తంభించిన ట్రాఫిక్
కరప: కాకినాడ – రామచంద్రపురం ప్రధాన రహదారిలో కరప మండలం వాకాడ బస్టాప్ సమీపంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షం రోడ్డుపై నేలకూలింది. దీంతో ట్రాఫిక్ మూడు గంటల పాటు స్తంభించింది. వాతావరణం మారి, ఈదురు గాలులు వీస్తుండటంతో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ వృక్షం కూలిపోయి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కాకినాడ నగరానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారితో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరప పోలీసులు, అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన వృక్షాన్ని మూడు గంటల్లో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.

రోడ్డుపై కూలిన భారీ వృక్షం