
కలం.. నిరసన గళం
పత్రికా స్వేచ్ఛను
హరించడం దుర్మార్గం
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం సక్రమంగా అమలు పత్రికల వల్లే సాధ్యం. పత్రికలకు ఆ స్వేచ్ఛ ఉండాలి. జర్నలిజం అంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పులను వెలికితీసి, ప్రజలకు తెలియజేయాలి. ఇదే రీతిలో వార్తలు రాస్తున్న ‘సాక్షి’ పత్రికా కార్యాలయాలకు మూడు నాలుగు రోజులుగా పోలీసులు వెళ్లడాన్ని సీపీఐ త్రీవంగా ఖండిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఈ ధోరణి రాజ్యాంగాన్ని బలి చేయడమే. ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు పత్రికా స్వేచ్ఛపై నిరంతరం మాట్లాడేవారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే పత్రికా స్వేచ్ఛపై దాడులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయకండి. ‘సాక్షి’పై దాడులు పునరావృతమైతే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తాం.
– తాటిపాక మధు,
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాకినాడ
● ‘సాక్షి’ గొంతు నొక్కే కుట్రలు సాగవు
● ప్రజాస్వామ్యంతో పరిహాసాలా?
● కూటమి సర్కారు తీరుపై నిరసన జ్వాల
● జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల నిరసనలు
● ప్రజా సంఘాల సంఘీభావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కలానికి సంకెళ్లు వేస్తారా? పోలీసు అక్రమ కేసులతో ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కుతారా? పదేపదే పత్రిక కార్యాలయానికి వెళ్లి వేధిస్తారా? సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, సిబ్బందిపై కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటారా? రాజకీయాలతో పత్రికలకు ముడిపెట్టే సంస్కృతి విడనాడండి. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే జర్నలిస్టులు ఎటువంటి పోరాటాలకై నా వెనుకాడేది లేదు అంటూ జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు శుక్రవారం గళమెత్తారు. ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఒకే గొడుకు కిందకు వచ్చి.. ‘సాక్షి’ మీడియాపై కక్ష కట్టిన కూటమి సర్కారు.. వెంటనే తన తీరు మార్చుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పెడుతున్న అక్రమ కేసులను ఎత్తేయాలని, తక్షణమే వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
కాకినాడ కలెక్టరేట్ వద్ద..
ఏపీయూడబ్ల్యూజే, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్, చిన్న పత్రికల సంఘాల సంయుక్త ఆధ్వర్యాన కాకినాడ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని అక్రమంగా విచారిస్తున్న పోలీసుల ఛాయాచిత్రాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన గళం వినిపించారు. ఎడిటర్ ధనంజయరెడ్డి సహా ‘సాక్షి’ మీడియాపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.. జర్నలిస్టులు, పత్రికలపై అక్రమ కేసులు సిగ్గుసిగ్గు.. పత్రికలను రాజకీయాలతో ముడిపెట్టడం మానుకోవాలి.. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు విజ్ఞాపన అందజేయాలని భావించారు. అయితే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి.. ఇలా ఉన్నతాధికారులెవరూ అక్కడ లేకపోవడంతో కలెక్టరేట్‌లోని జాతిపిత గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ పరిపాలనాధికారిని కలిసి విజ్ఞాపన అందజేశారు. జర్నలిస్టుల ఆందోళనకు సీపీఐ నేత తాటిపాక మధు మద్దతు తెలిపారు.
పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం అవివేకం
ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నేత డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా నిలిచే పత్రికల స్వేచ్ఛను హరించాలనుకోవడం ప్రభుత్వాల అవివేకమే అవుతుందన్నారు. అణచివేతతో జర్నలిస్టులు మరింత రాటుదేలి ఉద్యమంలోకి వస్తారనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తెరిగి వ్యవహరించాలని హితవు పలికారు. పత్రికల స్వేచ్ఛను హరించడమంటే ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను నొక్కేయడమేనని కాకినాడ సిటీ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ అన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సాక్షి బ్యూరో చీఫ్ ఎల్.శ్రీనివాసరావు, సాక్షి టీవీ కరస్పాండెంట్ బొక్కినాల రాజు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డెంకాడ మోహన్, సాయినాథ్, కొమ్మిరెడ్డి శ్రీధర్, ముమ్మిడి చిన్నా తదితరులు పాల్గొన్నారు.
పెద్దాపురం డీఎస్పీ తీరుపై నిరసన
పెద్దాపురంలో పాత్రికేయులు శాంతియుతంగా నిరసన తెలిపి, వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా.. అక్కడి డీఎస్పీ శ్రీహరిరాజు కార్యాలయం తలుపులు మూసేసుకున్నారు. పోలీసులతో కబురు పంపించినా కార్యాలయం లోపలకు జర్నలిస్టులను అనుమతించలేదు. పాతిక మంది జర్నలిస్టులు బయట వేచి ఉన్నా కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. డీఎస్పీ తీరుపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే దొంగలను, బంగారం పట్టుకున్న విషయంపై డీఎస్పీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి రావాలని అక్కడి సీఐ ద్వారా కబురు పంపగా జర్నలిస్టులు ఆ సమావేశాన్ని బహిష్కరించారు.
ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయులు ధర్నా చేశారు. వారికి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి, నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట తదితర ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
జర్నలిస్టులపై పెరుగుతున్న వేధింపులు
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నదీముల్లాఖాన్ దుర్రాని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, మానసిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి మారకుంటే జర్నలిస్టులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారని చెప్పారు.

కలం.. నిరసన గళం

కలం.. నిరసన గళం

కలం.. నిరసన గళం

కలం.. నిరసన గళం