బెధరగొట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

బెధరగొట్టేలా..

Oct 17 2025 9:46 AM | Updated on Oct 17 2025 9:46 AM

బెధరగ

బెధరగొట్టేలా..

అమాంతం పెరిగిన కూరగాయల ధరలు

వర్షాలతో కుళ్లిపోయిన తోటలు

తగ్గిన దిగుబడి

రైతుబజార్లకు తగ్గిన దిగుమతులు

గతంలో ప్రతి రోజూ 25 టన్నుల విక్రయాలు

నేడు 17 టన్నులు మాత్రమే..

ధరలు తగ్గించాలని ప్రజల డిమాండ్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): చిక్కుడు కాయలు చిక్కనంటున్నాయి.. దొండకాయలు దడ పుట్టిస్తున్నాయి.. బొబ్బర్లు అబ్బో అనిపిస్తున్నాయి.. ఆకుకూరలు హడలెత్తిస్తున్నాయి.. మార్కెట్‌లో కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు కురవక ముందు రూ.100 పెడితే నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయలు రైతుబజారులో దొరికేవి. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. పది రోజుల్లోనే కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో చిక్కుడు కాయలు పది రోజులు క్రితం రూ.75 ఉంటే ఇప్పుడు రూ.110కి చేరింది. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు గతంలో రూ.20కి నాలుగు కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కో కట్ట రూ.20 పలుకుతోంది. కొత్తిమీర అయితే కట్ట రూ.30కి విక్రయిస్తున్నారు.

వరుణుడి ప్రతాపంతో..

వారం రోజులు క్రితం వరకూ దాదాపు ప్రతి రోజూ క్రమం తప్పకుండా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తోటల్లో నీరు నిలిచిపోయి, తోటలు కుళ్లిపోయాయి. దీంతో, కూరగాయల దిగుబడి భారీగా పడిపోయింది. ఫలితంగా రైతుబజారుతో పాటు హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. జిల్లాలో పెద్దాపురంలో 1, కాకినాడలో 2 రైతుబజార్లున్నాయి. ఈ మూడింటిలో ప్రతి రోజూ 25 టన్నుల కూరగాయలు విక్రయించే వారు. ప్రస్తుతం వర్షాల కారణంగా 17 టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతుబజారులోనే ధరలు మండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక రిటైల్‌ మార్కెట్‌తో పాటు, ఇంటింటికీ తిరిగి అమ్మే వారి వద్ద కూరగాయలు కొనాలంటేనే వినియోగదారులు భయపడుతున్నారు. వంగ, దొండ, చిక్కుడు.. ఇలా కొన్ని రకాల కూరగాయలు ధరలు అధికంగా పెరిగాయి. మిగిలినవి కూడా కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకూ పెరిగాయి. రైతుబజారుకు కూరగాయల కోసం వస్తున్న ప్రజలు వాటి ధరలు విని అవాకై ్కపోతున్నారు. బయటి మార్కెట్లో కిలోకు అదనంగా రూ.20 చెబుతున్నారు. ఇంకా కార్తిక మాసం మొదలవకుండానే ఇలా ఉంటే.. ఇకపై ధరలు ఎలా పెరుగుతాయోనని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అయ్యప్ప భక్తులతో పాటు, మిగిలిన చాలా మంది కార్తిక మాసమంతా మాంసాహారం తీసుకోరు. దీంతో, ఆ మాసమంతటా కూరగాయల ధరలకు మరింతగా రెక్కలొస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రైతుబజారులో కొందరు తాము పండించిన కూరగాయలు కాకుండా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కొని ఇక్కడ విక్రయిస్తున్నారు. దీంతో, హోల్‌సేల్‌ కంటే కూడా రైతుబజారులో ఎక్కువ ధరలు చెబుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేయించి, ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

10 రోజుల వ్యవధిలో రైతుబజారులో కూరగాయలు ధరలు పెరిగాయిలా.. (కిలోకు రూ.లు)

నల్ల వంకాయ 25.00 40.00

మువ్వ వంకాయ 35.00 50.00

కాకర 20.00 30.00

బీర 25.00 40.00

క్యారెట్‌ 35.00 54.00

దొండ 20.00 30.00

గోరుచిక్కుడు 35.00 50.00

చిక్కుడు 75.00 110.00

బొబ్బర్లు 26.00 40.00

ఆకాకర 75.00 90.00

దిగుబడి బాగా తగ్గింది

వర్షాల కారణంగా తోటలు కుళ్లిపోవడంతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా తగ్గింది. ఇక్కడి రైతుబజారుకు పది రోజుల క్రితం 10 టన్నుల కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రెండు మూడు టన్నులు మాత్రమే వస్తున్నాయి. బయటి మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరగడంతో వినియోగదారులు రైతుబజారుకు అధికంగా వస్తున్నారు. రైతులను ఒప్పించి, తక్కువ ధరలకు అమ్మాలని ఆదేశాలు జారీ చేశాం.

– కృష్ణారావు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రైతుబజారు

ఎస్టేట్‌ అధికారి, కాకినాడ

తోటలు కుళ్లిపోయాయి

వీరవరంలో రెండెకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. గత నెల, ఈ నెలలో కురిసిన వర్షాల కారణంగా వంగ, టమాటాతో పాటు ఇతర కూరగాయల పంటలు కుళ్లిపోయాయి. ప్రస్తుతం ఎండ కాయడంతో బతికి ఉన్న కొన్ని మొక్కల నుంచి కూరగాయలు తెచ్చి, ఇక్కడ విక్రయిస్తున్నాం.

– పి.సూరిబాబు, రైతు

బెధరగొట్టేలా..1
1/4

బెధరగొట్టేలా..

బెధరగొట్టేలా..2
2/4

బెధరగొట్టేలా..

బెధరగొట్టేలా..3
3/4

బెధరగొట్టేలా..

బెధరగొట్టేలా..4
4/4

బెధరగొట్టేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement