
ప్రజా వ్యతిరేకంగా చంద్రబాబు పాలన
కాకినాడ కూరల్: కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ, ప్రజలకు వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆక్షేపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా నేమాం గ్రామంలో గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించి, ఆ ప్రతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ, చంద్రబాబు మాత్రం ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను పైవేటు రంగానికి ఇచ్చేస్తున్నారని అన్నారు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా అడిగే వారు లేరని సొంత మీడియాతో ప్రచారం చేయింకుంటున్నారని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి, కోటి సంతకాలు సేకరించి, గవర్నర్‌కు అందిస్తామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా అభివృద్ధి చేశారో అనే నిజం ప్రచారం అయ్యేలోపు.. చంద్రబాబు అనే ఒక అబద్ధం దేశాన్ని చుట్టి మళ్లీ అధికారంలోకి వచ్చి కూర్చుందని, ఆయన నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని కన్నబాబు దుయ్యబట్టారు. రూ.99కే క్వార్టర్ మద్యం ఇస్తామని చెప్పి, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. రూ.99కే మద్యం అనే మాట నిలబెట్టుకోకుండా విశాఖలో మాత్రం ప్రభుత్వ భూములను ఎకరం 99 పైసలకే అప్పనంగా కట్టబెడుతున్నా రని విమర్శించారు. ఈ మోసాలు ప్రజలకు, నాయకులకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాల్సి ఉందన్నారు. రుషికొండపై టూరిజం కట్టడాలను జగన్ ప్యాలస్ అంటూ ఆరోపించారని, ఇప్పుడు ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారని అన్నారు. కొన్నాళ్లకు పాఠశాలలను ప్రైవేటీకరించినా ఆశ్చర్యపోనవసరం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు.
నేమాం సర్పంచ్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రామదేవు సూర్యప్రకాశరావు (చిన్నా) మాట్లాడుతూ, తమ గ్రామంలో బెల్టు షాపులు కుటీర పరిశ్రమల్లా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు ఉద్యమం చేపడతామని అన్నారు. కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. చిన్నా ఆధ్వర్యాన, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, ఎస్‌ఈసీ సభ్యుడు గోపుశెట్టి బాబ్జీ, మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ మాకినీడి శేషుకుమారి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తున్నారు
ప్రభుత్వ వైద్యాన్ని నీరు గార్చేలా
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ
వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు
నేమాంలో రచ్చబండ ద్వారా
సంతకాల సేకరణ