
‘సాక్షి’పై పోలీసుల తీరు చట్ట విరుద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు రావడం చట్ట విరుద్ధమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాతాడ నవీన్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాక్షి’ పత్రికా కార్యాలయంలోకి వచ్చి, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి వరకూ హడావుడి చేయడం సరి కాదని అన్నారు. ఇతర పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం మంచిది కాదని, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని నవీన్‌రాజ్ డిమాండ్ చేశారు.
ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని జూమ్ ద్వారా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి 269 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకారం, రవాణా, కార్మిక శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 116 రైస్ మిల్లులను తనిఖీ చేశామని, అవన్నీ తమ బ్యాంకు గ్యారంటీలను త్వరితగతిన సమర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాకినాడ కార్పొరేషన్
ప్రత్యేకాధికారిగా కలెక్టర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కాకినాడ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన భావన బదిలీ కావడంతో ఇన్‌చార్జి కమిషనర్‌గా డిప్యూటీ కమిషనర్ కేటీ సుధాకర్‌ను నియమించారు. కార్పొరేషన్‌కు పాలక వర్గం లేకపోవడంతో కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది.
ఏలేరులో పెరిగిన నీటినిల్వలు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూండటంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువ నుంచి గురువారం 2,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, 85.25 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 21.47 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 1,200, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు.