
పెత్తందార్లకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ
● ఆ బాటలోనే చంద్రబాబు దోపిడీ పాలన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
● పెరుమాళ్లపురంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం
తొండంగి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. తన మందిమాగధులైన పెత్తందార్లకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని తొండంగి మండలం పెరుమాళ్లపురంలో గురువారం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం సహకారంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వీటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో 600 పడకల ఆస్పత్రితో పాటు వైద్య కళాశాల నిర్మాణంలో ఉన్నప్పటికీ అధికార కూటమి నేతలు అక్కడ కళాశాల, ఆస్పత్రి, వాటికి సంబంధించిన జీఓ లేదంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే వాటిని తీసుకున్న పెత్తందార్లకు ప్రజలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో తుని ఏరియా ఆస్పత్రిలోనే సుమారు 30 రకాల వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందుబాటులోకి తెచ్చామని రాజా గుర్తు చేశారు. సంపద సృష్టిస్తానంటూ అన్నీ ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.25 లక్షల విలువైన చికిత్సను కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా అందేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అనేక సంక్షేమ పథకాలను అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నార ని ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం.. ఇలా అన్ని మార్గా ల ద్వారా దోపిడీయే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చేసిన అప్పుల భారం అంతా ప్రజల పైనే పడుతుందని చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.