
సత్యదీక్షలు ప్రారంభం
అన్నవరం: రత్నగిరిపై సత్యదీక్షలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని వందలాదిగా భక్తులు ఈ దీక్షలు చేపట్టారు. పసుపు వస్త్రాలు ధరించి, తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి చేతుల మీదుగా తులసి మాలలు వేయించుకుని దీక్షలు ప్రారంభించారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వద్ద, కొండ దిగువన నేరేళ్లమ్మ, వినాయకుని ఆలయాల వద్ద సుమారు 400 మందితో పాటు జగ్గంపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలోని పవనగిరి స్వామీజీ ఆధ్వర్యాన మరో 400 మంది ఈ దీక్షలు స్వీకరించారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా దీక్షలు చేపట్టడం విశేషం. వీరు 27 రోజుల అనంతరం నవంబర్ 13న సత్యదేవుని సన్నిధిలో దీక్ష విరమిస్తారు. సత్యదీక్షలు ప్రారంభమైన సందర్భంగా వార్షిక కల్యాణ మండపం వద్ద సత్యదేవుడు, అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష విరమణ జరిగే వరకూ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇక్కడ పూజలు చేయనున్నారు. ఇంటి వద్ద పీఠం పెట్టే అవకాశం లేని స్వాములు వార్షిక కల్యాణ వేదిక మీద జరిగే పూజల్లో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.
సముద్రంలోకి
2.08 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 2,08,519 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు డెల్టాకు 2,700, మధ్య డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలంలో 18, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగుల నీటిమట్టం ఉంది.