
అనాథ శిశువు జాడ కోసం...
న్యూస్‌రీల్
కాకినాడ క్రైం: రోడ్డు పక్కన లభ్యమైన సుమారు నాలుగు నెలలు వయసున్న ఓ అనాథ ఆడ శిశువు జాడ కోసం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ రాత్రి 10.40 సమయంలో జగ్గంపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఓ ఆడ శిశువు ఏడుస్తూ ఉండడాన్ని మేడపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్ గమనించాడని తెలిపారు. శిశువుని చేరదీసి అనారోగ్యంగా ఉండడాన్ని గుర్తించి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి, చికిత్స అనంతరం ఆగస్టు 13వ తేదీన శిశు గృహకు అప్పగించాడని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది శిశువుని సంరక్షిస్తుండగా, బాలిక లభ్యతపై గత నెల 24న జగ్గంపేట పోలీసులు జీడీలో నమోదు చేశారన్నారు. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ జీజీహెచ్‌లో చేర్చామని తెలిపారు. శిశువు రక్త సంబంధీకులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సమీపంలో ఉన్న పీడీ కార్యాలయ అధికారులను లేదా 0884–2368442, 89191 23488 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
రీజెన్సీ తెరిచేందుకు
ప్రజా మద్దతు అవసరం
● సంస్థ ఎండీ జీఎన్ నాయుడు
యానాం: రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పునఃప్రారంభానికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ జీఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక ఐఏఎస్ అఽధికారి, ఆర్‌ఏఓ అంకిత్‌కుమార్‌ను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఆయన కలిసారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది క్రితం సీఎం రంగసామితో చర్చించిన అనంతరం రూ.30 కోట్ల పెట్టుబతో మెషినరీ అమర్చినట్టు తెలపారు. గెయిల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో ఆ పైపులు తుప్పుపట్టాయని, వాటికి అయ్యే రూ.80 కోట్ల వ్యయాన్ని తామే భరిస్తామని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వారిని కోరినట్టు తెలిపారు. సంస్థకు సహజవాయువు కేటాయింపుపై అక్టోబర్ 15వ తేదీలోగా ఎంపీల బృందం ప్రధానిని కలవనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సైతం రీజెన్సీ తెరవాలని ప్రజల మద్దతు తెలిసేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2012 జనవరి 27న జరిగిన ఫ్యాక్టరీ విధ్వంసం తదనంతర పరిణామాలు, ఇద్దరు మృతి ఘటనలపై సీబీఐ విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయుడు కోరారు. 665 మంది కార్మికులకు 25 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు సైతం వాటిలో నివాసాలకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో వారితో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం–తిరుపతి
విమాన సర్వీసు ప్రారంభం
కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి తొలి విమాన సర్వీసు బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ సర్వీసును ప్రారంభించారు. వర్చువల్ ద్వారా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థఈ సర్వీసు వారానికి 3 రోజులు నిర్వహిస్తుంది. ఉదయం 7–40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9–25 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. ఇక్కడ నుంచి 9–50 గంటలకు తిరుపతికి బయలుదేరి ఉదయం 11–20 గంటలకు చేరుతుంది. మొదటి 35 సీట్లు రూ.1,999కు, తర్వాత 35 సీట్లు రూ.4,000కు అందిస్తారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, శ్రీనివాసు, బలరామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

అనాథ శిశువు జాడ కోసం...

అనాథ శిశువు జాడ కోసం...