భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

Sep 30 2025 7:57 AM | Updated on Sep 30 2025 7:57 AM

భవనంప

భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

కాకినాడ క్రై: గంజాయి క్రయ, విక్రయాలతో పాటు తరలింపులో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఎస్పీ బిందుమాధవ్‌ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఒక ఇన్నోవా వాహనం అనుమానాస్పద రీతిలో పోలీసులను, టోల్‌ ప్లాజా సిబ్బందిని ఢీకొని దూసుకుని వెళ్లినట్టు ఆ వాహనం కదలికలపై నిఘా ఉంచాలని విశాఖ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. విశాఖ పోలీసులు తెలిపిన వాహనాన్ని జగ్గంపేట సర్కిల్‌ పరిధిలో కృష్ణవరం టోల్‌ ప్లాజా వద్ద ఈ నెల 23న మధ్యాహ్నం గుర్తించారు. కారును ఆపే క్రమంలో డ్రైవర్‌ కారులో నుంచి పోలీసులతో పోరాడాడు. ఈ క్రమంలో కారు అద్దాలు బద్దలైనా లెక్కచేయకుండా ప్రత్తిపాడు వైపు వేగంగా దూసుకుపోయాడు. అయితే ఈ పెనుగులాటలో పోలీసులకు డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ లభ్యమైంది. ఆ వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు, వెనుక సీట్లో పోలీస్‌ యూనిఫాం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంపై ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని రాసి ఉందని నిర్ధారించుకున్నారు. ప్రత్తిపాడు వైపు వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించగా, కొంత దూరంలో ఆ వాహనం మిస్సైంది. ఇదిలా ఉంటే టోల్‌ప్లాజా వద్ద ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కిర్లంపూడిలో పైడితల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న రోడ్డుపై వెళుతున్న కారు నుంచి పడిపోయిన రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పూటేజీల ఆధారంగా టోల్‌ప్లాజా వద్ద రచ్చ చేసిన కారు నుంచే ఈ ప్యాకెట్లు పడ్డాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. సాంకేతికత, ఈగల్‌ టీమ్‌ సహకారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కారును ట్రాక్‌ చేసే పనిలో పడింది. పోలీసుల కష్టం ఫలించి కారు కిర్లంపూడి మండలం రాజుపాలెం సమీపంలో ఒక రావిచెట్టు వద్ద లభ్యమైంది. కారుతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు రాజస్థాన్‌కు చెందిన వారని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగలకు వ్యాపారం నిమిత్తం వచ్చారని గుర్తించారు. వ్యాపారం ముసుగులో విశాఖ, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్‌ తరలిస్తున్నట్టు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. అలాగే జొన్నాడ టోల్‌ ప్లాజా వద్ద సిబ్బంది, పోలీసులను గాయపరిచిన ఘటనలో భీమునిపట్నం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 175 కిలోల గంజాయితో పాటు ఇన్నోవా కారు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరంలో ఏడుగురు భాగస్వాములు అయినట్టు గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ వివరించారు.

సామర్లకోట: స్థానిక జయలక్ష్మీ థియేటర్‌ సమీపంలోని ఒక భవనానికి పెయింటింగ్‌ వేస్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట పెన్షన్‌లైన్‌కు చెందిన అరవ అరుణ్‌కుమార్‌ (37) పెయింటింగ్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే రెండు అంతస్తుల భవనానికి పెయింటింగ్‌ వేస్తున్న సమయంలో తాడు జారిపోవడంతో అరుణ్‌కుమార్‌ కింద పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి1
1/1

భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement