
ఈవీఎంలతో ఓట్ల దుర్వినియోగం
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు
అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓట్ల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏవీఎంల విధానం వద్దు.. దాని స్థానే మాన్యువల్ విధానమైన బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్, పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ అనేక ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఓట్ల అక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పరంగా వైఎస్సార్ సీపీకి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ సంతకాలను సేకరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, యార్లగడ్డ రవీంద్ర, కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా అమలాపురం ప్రెస్‌క్లబ్ భవనంలో ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం రుద్రరాజు రూ.25 వేల చెక్కును ప్రెస్‌క్లబ్ ప్రతినిధులకు అందజేశారు.