
ఇదో ఫ్రీతలాటకం
తల్లికి వందనానికి ఆంక్షల కత్తెర
● స్కూళ్లలో ఉచిత సీట్ల పేరిట
తల్లికి వందనం నిలిపివేత
● కుటుంబంలో ఫ్రీ సీటు ఇచ్చింది ఒకరికి
● ఆ పేరుతో మిగిలిన వారందరికీ కోత
● తల్లిదండ్రుల ఆగ్రహం
పిఠాపురం: తమ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. సర్కారు వారి సాయంతో కనీసం తమ పిల్లలైనా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం ఫ్రీ సీటు అయితే ఇచ్చింది కానీ, ఆ పేరుతో ఆయా కుటుంబాలకు తల్లికి వందనం నిధులు నిలిపివేసింది. అది కూడా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒకరికి ఉచితంగా సీటు ఇచ్చి.. ఆ పేరుతో మిగిలిన పిల్లలంరికీ తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టేసింది. ఇటు తమ బిడ్డలకు ప్రైవేటు స్కూలులో ఉచిత సీటు వచ్చిందన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు అంతలోనే ఆవిరైపోయింది. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులివ్వాలంటూ అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ సీట్లు ఇచ్చినప్పటికీ అమ్మ ఒడి డబ్బులు మాత్రం యథాతథంగానే జమ చేసేవారు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘ఉచితం’ పేరుతో అనుచిత విధానం అవలంబిస్తోందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2,960 ఉచిత సీట్లు
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలి. దీని ప్రకారం, జిల్లావ్యాప్తంగా 2,960 మంది విద్యార్థులకు వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకూ 1,207 మంది ఆన్‌లైన్‌లో, 216 మంది ఆఫ్‌లైన్‌లో కలిపి మొత్తం 1,423 మంది వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మరో 1,537 మంది ఆయా పాఠశాలల్లో ఇంకా చేరాల్సి ఉంది. ఉచిత సీట్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకూ 48.08 శాతం మంది విద్యార్థులు మాత్రమే చేరారు. 20 శాతం మంది ఫ్రీ సీటు తీసుకోవడానికి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారిలో తల్లికి వందనం నిలిచిపోయిన విద్యార్థులు సుమారు 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తల్లికి వందనం సాయం ఎందుకు నిలిచిపోయిందో అర్థం కాక వీరందరూ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
కోతలే కోతలు
ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో గొప్పగా డప్పేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల సాకులతో అనేక మంది అర్హులకు ఈ పథకంలో కోతలు పెడుతున్నారు. కరెంటు బిల్లులు అధికంగా చూపించి కొందరికి, వ్యవసాయ భూములు లేని వారికి కూడా ఉన్నట్లు చూపించి పలువురికి ఈ పథకం ఆపేశారు. మరి కొందరికి పథకం వర్తింపజేసినా రూ.15 వేలకు బదులు రూ.13 వేలు, రూ.9 వేలు మాత్రమే వేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫ్రీ సీటు వంకతో ఆయా కుటుంబాల్లోని ఇతర విద్యార్థులకు ‘తల్లికి వందనం’లో కోత పెట్టారు.
ఇద్దరు పిల్లలకు వెయ్యలేదు
మాకు కార్తీక్, తేజ ఇద్దరు కుమారులు. ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. ఇద్దరికీ తల్లికి వందనం పథకం డబ్బులు వెయ్యలేదు. అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో చూసుకోమన్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ ఆర్‌టీఈ’ అని చూపిస్తోంది. మేము అర్హులమే కదా! లిస్టులో ఎలిజిబుల్ అని వచ్చింది కదా! అలా ఎందుకు చూపిస్తోందని అధికారులను అడిగితే తామేమి చేయలేమని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో డబ్బులు కచ్చితంగా పడిపోయేవి. ఇప్పుడే ఇలా వంకలు పెట్టి ఆపేస్తున్నారు. అర్హత ఉన్నా పథకం ఆపేయడం చాలా దారుణం.
– రసబోయిన అర్జమ్మ, చేబ్రోలు,గొల్లప్రోలు మండలం
ముగ్గురికీ వెయ్యలేదు
మా ముగ్గురు పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవి తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్‌లైన్‌లో వచ్చింది. అందరికీ పడినట్లే ముగ్గురు పిల్లలకూ కలిపి మాకూ రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. మా పిల్లల్లో ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికై నా వేస్తారనుకుంటే వెయ్యలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్టుమెంట్ ఆర్‌టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు.
– నూజివీడు దేవి, చేబ్రోలు,
గొల్లప్రోలు మండలం
ఫిర్యాదులు చేస్తున్నారు
ఫ్రీ సీటు పొందిన వారి కుటుంబంలో మిగిలిన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. దీనిపై చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నా రు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
– పి.రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

ఇదో ఫ్రీతలాటకం

ఇదో ఫ్రీతలాటకం

ఇదో ఫ్రీతలాటకం