
నేడు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాజా కోరారు.
ఎంపీడీఓలకు నేటి నుంచి శిక్షణ
సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలుగా పదోన్నతులు పొందిన వారికి స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రం పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని 89 మంది ఎంపీడీఓలకు ఆగస్టు 26 వరకూ శిక్షణ ఇస్తారు. మొదటి బ్యాచ్‌లో 46 మందికి సోమవారం శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ శిక్షణను ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు ప్రారంభిస్తారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు, గెస్ట్ ఫ్యాకల్టీలు శిక్షణ ఇస్తారు. ఆదివారాలు, రెండో శనివారం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి సెలవులుంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆగస్టు 15న స్వాత్రంత్య దినోత్సవం అందరితో కలసి నిర్వహిస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పరిపాలనా విధానాలు, సంక్షేమ పథకాలు, సభలు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణతో పాటు ఫీల్డు విజిట్ కూడా ఉంటుందని ప్రసాదరావు వివరించారు.
లోవకు కొనసాగుతున్న
భక్తుల రద్దీ
తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించారు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగదు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు.
అంతరిక్ష యానంపై
నేడు సదస్సు
పిఠాపురం: అంతరిక్ష యానంపై పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ స్కూల్లో విద్యార్థులకు సోమవారం ఉదయం 9 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాలు, మిషన్లపై ప్రదర్శనలు, స్పేస్ మోడల్స్, వీడియో ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్లు, క్లియర్ టాక్స్, సైన్స్ సిటీ రిసోర్స్ పర్సన్ల ప్రత్యేక ఉపన్యాసాలు, స్పేస్ క్విజ్, గేమ్స్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, సర్టిఫికెట్ల ప్రదానం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా ఉంటాయని వివరించారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి పర్యవేక్షణలో విద్యా శాఖ, సమగ్ర శిక్ష, ముస్కాన్ సంస్థ, సైన్స్ సిటీ సంయుక్త ఆధ్వర్యాన ఈ సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. పిఠాపురం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ కోరారు.

నేడు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి