
వేతన వేదన
అన్నవరం: ఆవులూ ఆవులూ కుమ్ములాడుకుని లేగదూడల కాళ్లు తొక్కేసినట్టుగా ఉంది అన్నవరం దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పరిస్థితి. రూ.30 లక్షల నకిలీ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చలానాలు సమర్పించిన వ్యవహారంలో దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్టర్ విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో దేవస్థానం శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వేంకటేశ్వరరావు, గుమస్తా ఎం.రామకృష్ణను ఈఓ వీర్ల సుబ్బారావు ఇటీవల సస్పెండ్ చేశారు. గతంలో కాంట్రాక్టర్ ఉన్నప్పుడే పారిశుధ్య సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించేవారు కాదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ పలు సందర్భాల్లో వెలుగులోకి తీసుకుని రావడంతో జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకునేవారు. ఈ నెలలో 27 రోజులు గడచినప్పటికీ జూన్ నెల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఫేక్ పీఎఫ్ చలానాల వ్యవహారంలో కాంట్రాక్టర్‌ను తొలగించడంతో దేవస్థానంలో పని చేస్తున్న 350 మంది పారిశుధ్య సిబ్బందికి జీతాల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరుకై నా వస్తాయనే నమ్మకం కలగడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
‘సాక్షి’ కథనంతో..
దేవస్థానంలో ఏ టెండరూ పిలవకుండా, ఎటువంటి డిపాజిట్ లేకుండానే నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్‌కు గత మార్చి నెలలో శానిటేషన్ కాంట్రాక్ట్‌ను నామినేషన్ పద్ధతిలో అప్పగించిన విషయం విదితమే. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ప్రతి నెలా సిబ్బంది జీతంలో 22.5 శాతం (12.5 శాతం దేవస్థానం వాటా, 10 శాతం ఉద్యోగి వాటా) అంటే సుమారు రూ.10 లక్షలు పీఎఫ్ చెల్లించాలి. ఆ రశీదు దేవస్థానానికి జమ చేస్తే, దానిని పరిశీలించి శానిటేషన్ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు రూ.59 లక్షల బిల్లును దేవస్థానం ఆమోదించేది. అయితే గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆ కాంట్రాక్టర్ ఫేక్ పీఎఫ్ రసీదులు సృష్టించి రూ.1.77 కోట్ల మేర బిల్లు చేయించుకున్నారు. తమ ఖాతాల్లో పీఎఫ్ పడలేదని గుర్తించిన పారిశుధ్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడంతో దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి మూడు నెలల పీఎఫ్ మొత్తం తిరిగి జమ చేయించారు. ఇలా చేస్తే ఏ గొడవా ఉండదని అధికారులు, కాంట్రాక్టర్ కూడా భావించారు. దీనిపై ‘అన్నవరంలో శానిటేషన్ కాంట్రాక్టర్ మోసం’ శీర్షికన ఈ నెల 17న సాక్షి వార్త ప్రచురించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పీఎఫ్ అధికారుల విచారణ అనంతరం కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు.
ఎవరి ఒత్తిళ్లతో చేశారో!
ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఒక భవనం నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందిన వ్యక్తికి మరో భారీ భవనం నిర్మించే కాంట్రాక్ట్ ఎంతమాత్రం ఇవ్వరు. ఆ భారీ భవనం నిర్మాణానికి కూడా టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌ను ఖరారు చేస్తారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం ఇలాగే చేశారు. కేవలం 34 మంది సిబ్బందిని సరఫరా చేయడానికి టెండర్ ద్వారా ఎంపిక చేసిన కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్‌కే ఎటువంటి టెండర్ పిలవకుండా ఏకంగా 350 మంది పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను గత మార్చి నెలలో అప్పగించేశారు. దీనికి దేవస్థానం అధికారులు ప్రతిపాదన పంపడం.. కమిషనర్ వెంటనే అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. నెలకు రూ.59 లక్షలు చెల్లించే ఈ భారీ కాంట్రాక్ట్‌ను ఇలా ఎందుకు అప్పజెప్పారు.. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు సెవెన్ హిల్స్ సంస్థ పొందిన కాంట్రాక్ట్ గత ఏడాది అక్టోబర్‌తో ముగిసింది. టెండర్ పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వాలని చాలా మంది ఒత్తిళ్లు తెచ్చినా అక్కడి అధికారులు లొంగలేదు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకూ పాతవారినే కొనసాగిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో కనకదుర్గ మ్యాన్‌పవర్ సంస్ధకు అప్పగించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీతాల చెల్లింపు ఎలా?
ఫేక్ పీఎఫ్ చలానాల వివాదం నేపథ్యంలో పారిశుధ్య సిబ్బందికి వేతనాలు ఏవిధంగా చెల్లించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. జూన్ నెల జీతాల చెల్లింపునకు దేవస్థానం సెక్యూరిటీ కాంట్రాక్టర్ సహకారం కోరారు. ఆ కాంట్రాక్టర్ దేవస్థానంలో 60 మంది సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బందిని కూడా అతడే సరఫరా చేసినట్లు చూపించి, అతడి ద్వారానే పీఎఫ్ కట్టించి, జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి కమిషనర్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఈవిధంగానైనా తమకు నెలాఖరులోగా జీతాలివ్వాలని సిబ్బంది కోరుతున్నారు.
రత్నగిరి శానిటేషన్ సిబ్బంది జీతాల
చెల్లింపులో మళ్లీ ప్రతిష్టంభన
ఫేక్ పీఎఫ్ రసీదుల వ్యవహారంతో
అయోమయం
కాంట్రాక్టర్ తొలగింపు.. కేసు నమోదు
ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌తో
కొరవడిన పర్యవేక్షణ
ఆ బాధ్యతలు తీసుకోవడానికి
వెనుకాడుతున్న సిబ్బంది
ఈ నెల ముగిసిపోతున్నా
అందని గత నెల వేతనాలు