
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● రూ.30 లక్షల ఆదాయం
అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం చేసి, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, చిట్టి శివ, ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తాత్రేయశర్మ, పరిచారకుడు గణేష్ తదితరులు నిర్వహించారు. సత్యదేవుడిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.