కౌలుకోనివ్వరా..! | - | Sakshi
Sakshi News home page

కౌలుకోనివ్వరా..!

Jul 22 2025 7:55 AM | Updated on Jul 22 2025 8:19 AM

కౌలుక

కౌలుకోనివ్వరా..!

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

ఇవ్వని సర్కారు

జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం 63 వేలు

ఇప్పటి వరకూ జారీ చేసినవి 23 వేలు

కార్డులు లేక రైతులు విలవిల

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు పైగా అయ్యింది. ఒకపక్క వరి నారు పోసుకున్న కౌలు రైతులు.. అవసరమైన ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే)కు వెళ్తే చుక్కెదురవుతోంది. వారికి పంట సాగు హక్కు (సీసీఆర్‌) కార్డులు లేకపోవడంతో ఎరువులు ఇచ్చేందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో, పంట పొలాలకు కావాల్సిన ఎరువులు బయటి మార్కెట్‌లో ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకులు, సొసైటీల నుంచి పంట రుణాలు కూడా రాకపోవడంతో కౌలురైతులు నానా ఇక్కట్లూ పడుతున్నారు.

బారెడు లక్ష్యం.. ఇచ్చింది స్వల్పం

జిల్లావ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు 2.18 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నది కౌలు రైతులే. ఒక్కొక్కరు రెండు నుంచి ఐదెకరాల వరకూ కౌలుకు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు తమ పొలాలు సాగు చేసేందుకు ఇష్టపడటం లేదు. కొంత మంది సొంతంగా సాగు చేసినా కూలి రేట్లు అధికంగా ఉండటం, ఉన్న కొద్దిపాటి భూమి సాగు చేసినా లాభాలు రాకపోవడంతో కౌలుకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప ఇతర పనులు చేసుకోలేని రైతులు ఆ భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 63 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకూ 23 వేలు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో సీజన్‌ ప్రారంభం కాకముందే ఏటా కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. ఆయా గుర్తింపు కార్డుల ఆధారంగా కౌలు రైతులకు సైతం బ్యాంకులు రూ.లక్షకు తక్కువ కాకుండా రుణాలు మంజూరు చేసేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకే ఆసక్తి చూపడం లేదు.

‘గుర్తింపు’ లేక..

పంటలకు అవసరమైన ఎరువుల కోసం కౌలు రైతులు ఆర్‌ఎస్‌కేలకు, సహకార సంఘాలకు వెళ్లినా ప్రయోజనం ఉండటం లేదు. సీసీఆర్‌ కార్డులు చూపిస్తున్న వారికి అక్కడ ఎరువులు ఇస్తున్నారు. అయితే, ఆ కార్డులు ఇంకా ఇవ్వకపోవడంతో చాలా మంది కౌలు రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నారుమడులకు యూరియా, డీఏపీ వేయాల్సి ఉంది. గత్యంతరం లేకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఎరువుల డీలర్లు యూరియా, డీఏపీపై బస్తాకు రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నారుమడులకు ఎరువులు తక్కువగా వేస్తారు. వరి నాట్లు పూర్తయితే ఎకరాకు బస్తాకు పైగా యూరియా, కాంప్లెక్సు ఎరువులు మొదటి విడతగా వేయాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సీసీఆర్‌ కార్డు ఆధారంగా కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకూ రుణాలు సైతం మంజూరు చేసేవారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది గుర్తింపు కార్డులిచ్చినా ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదని కౌలు రైతులు మండిపడుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

వ్యవసాయానికి సంబంధించిన ఏ పనిపై వెళ్లినా అధికారులు కౌలు గుర్తింపు కార్డులు అడుగుతున్నారు. సీజన్‌ ప్రారంభమైనప్పటికీ ఈ ఏడాది ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రేపు మాపు అని చెబుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే రెవెన్యూ అధికారులు కార్డులివ్వాలని చెబుతున్నారు.

– మారేళ్ల వెంకట రమణ, కౌలు రైతు,

యండమూరు, కరప మండలం

గత ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

గత ఏడాది ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు పని చేయవని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కార్డులు ఇవ్వలేదు. గత ఏడాది గుర్తింపు కార్డులు ఇచ్చినా బ్యాంకు రుణం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఈ ఏడాదైనా కూటమి ప్రభుత్వం తక్కువ వడ్డీలకు బ్యాంకుల్లో రుణాలిప్పించే ఏర్పాట్లు చేయాలి.

– ఇంటి వెంకటరావు, కౌలు రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం

కౌలుకోనివ్వరా..!1
1/2

కౌలుకోనివ్వరా..!

కౌలుకోనివ్వరా..!2
2/2

కౌలుకోనివ్వరా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement