
పీ–ఫోర్.. శ్రీమంతులు పరార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్ప గా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్‌జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
ముందుకురాని మార్గదర్శకులు
పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్‌షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు.
ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అధికారులకు గుదిబండ
పేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది.
57 వేల బంగారు కుటుంబాల గుర్తింపు
తూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1,226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్‌రెన్స్‌లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు.
మార్గదర్శకులు ముందుకు రావాలి
పి–4 కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించే దిశగా సమష్టి కృషి జరుగుతోంది. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు, విద్యా వంతులు, పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకురావాలి. ఒక వ్యక్తి అనేక కుటుంబాలకు దరఖాస్తు చేస్తే ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతుదారుగా నిలుస్తారు. ఉపాధి, విద్య, ఆరోగ్య పరిస్థితులపై స్వావలంబన దిశగా అడుగులు పడతాయి. జిల్లాలో 489 గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, సమాజంలో మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్న వ్యక్తులు ఒకరిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. సామాజిక చైతన్యం, స్పృహ కలిగి ఉండే కార్యక్రమం ఇది.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా