
సాక్షి, విశాఖపట్నం: దేవుడి పేరిట జరిగిన వ్యాపారానికి చెక్ పడింది. వివాదాల నేపథ్యంలో నగరంలో ఏర్పాటు అయిన అయోధ్య రామయ్య సెట్ మూతపడింది. నిర్వాహకులు ఇచ్చిన స్టేటమెంట్ తప్పు అని గుర్తించిన పోలీసులు.. వాళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు.
విశాఖపట్నంలో అయోధ్య ఆలయాన్ని తలపించే సెటప్ మొదటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తి ముసుగులో టికెట్ల పేరుతో భారీ మోసానికి దిగారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కల్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ క్రమంలో నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటిదేం లేదంటూ నిర్వాహకులు మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. మరోవైపు.. సాక్షి సహా పలు మీడియా సంస్థలు అయోధ్య సెట్ నిర్వాహకుల కమర్షియల్ బాగోతాలను వరుస కథనాలతో బయటపెట్టింది. అదే సమయంలో.. ఫ్లెక్స్ యజమానితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడంతో మొత్తం నిర్వాకం బయటపడింది.
మీడియా కథనాలు, తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్, భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. కేవలం.. ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసమే భద్రాచలం పేరును నిర్వాహకులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 35 కింద విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు సెట్‌ను మూసేసి.. సర్దుకుంటున్నారు.