
చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు పెట్టాలి
తుని: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని చెప్పిన మంత్రి నారా లోకేశ్, మోసగించిన చంద్రబాబులపై ప్రజలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రజలను కోరారు. శుక్రవారం తుని మర్చంట్ అసోసియేషన్ భవనంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై పట్టణ వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శి రేలంగి రమణగౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాడిశెట్టి మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్లారని, ఇది చూసి ఆందోళన చెందిన చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఏడాది పూర్తవుతున్నా రెండు పథకాలు మాత్రమే అమలు చేశారని, మిగిలిన వాటి జోలికి వెళ్లడంలేదన్నారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మరో మంత్రి అచ్చెన్నాయుడు అనడాన్ని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకంలో 30 లక్షల మందికి మెండి చేయి చూపించారని విమర్శించారు. ఇదే చంద్రబాబు వైఎస్సార్ సీపీ హయంలో సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక, సోమాలియాలా అయిపోతుందని గగ్గోలు పెట్టారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 13 శాతం గ్రోత్ రేటు ఉంటే ఈ ప్రభుత్వంలో 3 శాతం ఉందని, అంటే 10 శాతం వృద్ధి రేటు తగ్గిందన్నారు. ప్రజలు 2014–19, 2019–24 మధ్య కాలంలో ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరిగిందో విశ్లేషించుకోవాలన్నారు. మద్యం కేసుకు సంబంధించి గత ప్రభుత్వం 3.28 కోట్ల పత్రాలను ధ్వంసం చేసిందని చెబుతున్నారని, ఇది ఏలా సాధ్యమో ప్రజలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించారని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నిరంతరం కృశారని, ఇదే చంద్రబాబు అయితే రూ.కోట్లలో నిధులు పక్కదారి పట్టి ఉండేవన్నారు. తుని పట్టణ బాధ్యతను తానే తీసుకుంటున్నానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ అందరికీ పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే తునిలో ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం టీడీపీ కార్యకర్తలకే ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర క్రిష్టియన్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా జాన్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసగించడంలో దొందూ దందే
ప్రజా సంక్షేమం కోసం జగన్ పని చేశారు
కరోనా సమయంలో
ఆర్థికంగా ఆదుకున్నారు
మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా