భారీ ప్యాకేజీలే లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

భారీ ప్యాకేజీలే లక్ష్యం!

Jul 26 2025 9:14 AM | Updated on Jul 26 2025 9:50 AM

భారీ

భారీ ప్యాకేజీలే లక్ష్యం!

సీఎస్‌ఈ వైపు మొగ్గుతున్నారు

ఇంజినీరింగ్‌ అంటే సాఫ్ట్‌వేర్‌ అనే విధంగా ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. బీటెక్‌లో సంప్రదాయ కోర్సులు ఉన్న నేటి కాలంలో సా ంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులు రావడంతో విద్యార్థులు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలెజెన్స్‌, డేటాసై న్స్‌ వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీ, కోడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌, సాఫ్ట్‌స్కిల్స్‌పై అవగాహన ఉంటే ఉపాధి త్వరగా పొందవచ్చు.

– ఎన్‌.రామకృష్ణయ్య,

సీఎస్‌ఈ ప్రొఫెసర్‌, జేఎన్‌టీయూకే

రేపటి నుంచి

రెండవ దశ కౌన్సెలింగ్‌

మొదటి దశలో సీటు పొందిన విద్యార్థులు శనివారం సాయంత్రంలోగా కళాశాలలో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. రెండో దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌కు షెడ్యూల్‌ విడుదల చేశారు.

షెడ్యూల్‌ ఇదే..

27వ తేదీ నుంచి 30 వరకూ రిజిస్ట్రేషన్‌.

28 నుండి 30 వరకూ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌.

28 నుండి 31 వరకూ వెబ్‌ అప్షన్లు.

ఆగస్టు 1న వెబ్‌ అప్షన్లు మార్పు.

ఆగస్టు 4న సీట్లు కేటాయింపు.

ఆగస్టు 8న రిపోర్టింగ్‌కు తుది గడువు.

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాలకు కన్వీనర్‌ కోటా ద్వారా సీట్లు సాధించిన విద్యార్థుల చేరికకు శనివారం సాయంత్రంతో తుది గడువు ముగియనుంది. దీంతో మరో వారం రోజుల్లో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్‌లో దాదాపు 40 వరకూ వివిధ కోర్సులకు బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యార్థులు మూడో ఏడాదిలోనే భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌కు అనువుగా కంప్యుటర్‌ సైన్స్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), ఇంటర్‌నెట్‌ ఆఫ్‌థింగ్స్‌(ఐవోటీ) బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, మెషీన్‌ లెర్నింగ్‌, డైటా సైన్స్‌ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి దేశ విదేశాల్లో అపార ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులకు ఆసక్తి చూపుతున్నారు. కన్వీనర్‌ కోటాలో సీటు రాకపోయినా ప్రతి కళాశాలకు బ్రాంచ్‌కు 12 సీట్లు చొప్పున మేనేజ్‌మెంట్‌ కోటా ఉండటంతో ఈ కోటాలో చేరడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. కాకినాడ జిల్లా పరిధిలో పేరొందిన ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచ్‌కు రూ.3 నుంచి రూ.4 లక్షలు డోనేషన్‌ చెబుతున్నారంటే ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాశాలల్లో అన్ని విభాగాలు కలిపి 16,700 సీట్లు ఉండగా వీటిలో 5,600 వరకూ సీఎస్‌ఈ విభాగానికి చెందినవే. వీటిలో 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్న బ్రాంచ్‌లలో సీట్లు తగ్గించి సీఎస్‌ఈ సంబంధిత కోర్సులకు అధిక సీట్లు కేటాయించాలని ఉమ్మడి జిల్లాలోని ఏడు కళాశాలలు జేఎన్‌టీయూకేకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపని మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, ఆటో మొబైల్‌, ఈఈఈ, మైనింగ్‌ వంటి విభాగాలో కోర్సులను ఆయా కళాశాలలు వదిలించుకుంటున్నాయి.

ప్రారంభ ప్యాకేజీ రూ.4 లక్షలు

సీఎస్‌ఈ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన వారికి ప్రారంభ ప్యాకేజీ రూ.4 కావడం, టీసీఎస్‌, విప్రో, హెచ్‌పీసీఎల్‌, మెక్రోసాఫ్ట్‌, టెక్‌ మహీంద్ర, ఐబీఎం వంటి కంపెనీలు ఆ కోర్సులు చేసిన విద్యార్థుల కోసం క్యూ కట్టడంతో డిమాండ్‌ పెరిగిపోయింది. గత ఏడాది సీఎస్‌ఈ విద్యార్థులు ఇద్దరికి రూ.36 లక్షలు, సీఎస్‌ఈ ఎంటెక్‌ విద్యార్థికి గూగుల్‌ సంస్థలో సెక్యూరిటీ అనలిస్ట్‌గా రూ.67 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం జేఎన్‌టీయూకే చరిత్రలో మైలు రాయిగా నిలచింది. జేఎన్‌టీయూకేతో పాటు అనుబంధ కళాశాలల్లో సీఎస్‌ఈ బ్రాంచ్‌ విద్యార్థులు 95 శాతం నాలుగో ఏడాదిలో ఉండగానే ఉద్యోగాలు రావడం వంటివి మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

సంప్రదాయ సీట్లకు తగ్గిన ఆదరణ

ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, ఐటీ, సివిల్‌ వంటి బ్రాంచ్‌ల సీట్లు జేఎన్‌టీయూకే వంటి కళాశాలలలో తప్ప వాటి అనుబంధ ప్రైవేట్‌ కళాశాలల్లో పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు.బ్రాంచ్‌కు 60 సీట్లు చొప్పున ఉంటే 30 నుంచి 35 వరకూ మాత్రమే భర్తీ అవుతున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఏ కోర్సు చేసిన సాఫ్ట్‌వేర్‌ రంగమే

బీటెక్‌లో ఏ కోర్సు అభ్యసించిన నాలుగో ఏడాది సాఫ్ట్‌వేర్‌ రంగ సంస్థలు చేపట్టే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ పరిధిలో పేరొందిన ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ, మెకానికల్‌ విద్యార్థులు నాలుగో ఏడాదిలో ఉండగా 20 లక్షల ప్యాకేజీతో ఇటీవల ఉద్యోగాలు సాధించారు. ప్రైవేట్‌ కళాశాలలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సీఆర్‌టీ (క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌) తరగతులు నిర్వహించి క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇస్తున్నారు. జేఎన్‌టీయూకే అన్ని బ్రాంచ్‌లు కలిపి 300 సీట్లు ఉండగా 90 శాతం మంది ప్రముఖ టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. దీన్నిబట్టి ఏ బ్రాంచ్‌ తీసుకున్నా అఖరి సంవత్సరంలో ఒకే రంగంలోకి వస్తున్నారన్నది అర్థమౌతోంది. జేఎన్‌టీయూకే ఈసీఈ విద్యార్థి బొడపాటి నివాస్‌ రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.

ఏఐ, డేటాసైన్స్‌లే అందరి ఆప్షన్‌

సంప్రదాయ కోర్సులు కాదని

సీఎస్‌ఈ వైవే విద్యార్థుల మొగ్గు

ఉమ్మడి జిల్లాలో 5,600 సీట్లు అవే

నేటితో తొలి దశ షెడ్యూల్‌ ముగింపు

రేపటి నుంచి రెండో దశ షెడ్యూల్‌

భారీ ప్యాకేజీలే లక్ష్యం!1
1/1

భారీ ప్యాకేజీలే లక్ష్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement