
సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం
రుత్విక్కులకు దీక్షావస్త్రాలు అందజేసిన
చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు
అన్నవరం: రత్నగిరీశుని 135వ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు విఘ్నేశ్వరపూజ, పుణ్యావహచనం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి జయంత్యుత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రధాన ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పట్టువస్త్రాలతో, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జప, తపాలు చేసే 40 మంది రుత్విక్కులకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దీక్షా వస్త్రాలను అందచేశారు. రుత్విక్కుల వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సూర్య నమస్కారాలు, లింగాష్టకం, నవావరణ అర్చన, రామాయణ, భాగవత పారాయణ, శ్రీ, పురుష సూక్త పారాయణ, బాలా, కౌమారీ, సువాసినీ పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్బారు మండపంలో మండపారాధన, కలశస్థాపన ఆయుష్యహోమానికి అంకురార్పణ చేశారు.
గరుడ వాహనంపై ఊరేగింపు
సత్యదేవుడు, అమ్మవారిని సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు గరుడ వాహనంపై కొండ దిగువన ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంగణాలను విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఆస్థాన వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, శివ ఘనపాఠి, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి పాల్గొన్నారు.
నేడు స్వామివారి జయంత్యుత్సవం
సత్యదేవుని జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారు, శంకరులకు అలంకరణ, 11 గంటలకు అనివేటి మండపంలో ఆయుష్యహోమం పూర్ణాహుతి నిర్వహించనున్నారు.