డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ

Jul 17 2025 3:36 AM | Updated on Jul 17 2025 3:36 AM

డిసెంబర్‌ నాటికి  టిడ్కో ఇళ్ల పంపిణీ

డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ

కాకినాడ సిటీ: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 365/430 కేటగిరీ టిడ్కో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కలెక్టర్‌ షణ్మోహన్‌ గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు. జిల్లాలో జీరో పావర్టీ, పీ–4 కార్యక్రమ అమలు ప్రగతిని వివరించారు. రూరల్‌ నియోజకవర్గం పరిధిలో 11 ఏళ్లగా ఎన్నికలు జరగని ఏడు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక, సాధారణ నిర్వహణ కష్టమవుతోందని, ఈ పంచాయతీలను కాకినాడ నగరంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. సమావేశంలో ఒన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ స్కీమ్‌ కింద పెద్దాపురం సిల్క్‌ చీర ఉత్పత్తులు ఎంపికై నందుకు అధికారులను, నేతన్నలను మంత్రి అభినందించారు. సమావేశంలో జేసీ రాహుల్‌ మీనా, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ భావన, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మనీషా తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణంలో తనిఖీలు

శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్‌ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్‌లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్‌.మౌళిప్రసాద్‌ పాల్గొన్నారు.

20న జిల్లా స్థాయి

యోగాసన పోటీలు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర భారత్‌ యోగాసన క్రీడా సంఘం, కోకనాడ యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఆదివారం స్థానిక జేఎన్‌టీయూ యోగా హాల్‌లో జిల్లా యోగాసన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు సానా సతీష్‌ బాబు, అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ సుధాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లు నిండిన వారి నుంచి 14 ఏళ్ల వారి వరకు, 14 నుంచి 18 వరకు, 18 నుంచి 28 వరకు, 28 నుంచి 35 వరకు, 35 నుంచి 45 వరకు, 45 నుంచి 55 ఏళ్లవారి వరకు వివిధ కేటగిరీలలో యోగాసన పోటీలు జరుగుతాయని వారు తెలిపారు. ఆరు విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొనవచ్చునని ప్రపంచ యోగాసన, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ వారు ఇచ్చిన సిలబస్‌ ప్రకారం ట్రెడిషనల్‌ యోగ, రిథమిక్‌ యోగ, ఆర్టిస్ట్‌ యోగ, 10 రకాల పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 91334 33491 నంబరులో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

అతిథి అధ్యాపకులకు

దరఖాస్తుల ఆహ్వానం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్‌.కె.ఆర్‌. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, బోటనీ, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైనన్స్‌ , కామర్స్‌లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్‌ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement