
తమ్ముళ్ల స్వరకల్పనలో వేలంపాట!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు అన్నంత పనీ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో బరితెగించి మరీ శ్రీ సంస్థానం భూములను దోచి పెడుతున్నారు. వేలం అనే ముసుగువేసి తాంబూలం ఇచ్చిన వారికే భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చేయి తడపని వారికి మొండిచేయి చూపిస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాలు తు.చ. తప్పకుండా దేవదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. భూముల వేలాన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. పేద విద్యార్థుల ఆకలి దప్పులు తీర్చాలన్న ఆశయంతో పిఠాపురం మహారాజా దానం చేసిన శ్రీ సంస్థానం భూములపై గద్దల్లా వాలిపోయి అడ్డగోలుగా అయినకాడికి దోచుకోవాలనుకుంటోన్న కూటమి నేతల కుట్రకోణమిది.
రెండో రోజూ కొనసాగిన తంతు
పిఠాపురం కేంద్రంగా ఉన్న శ్రీ సంస్థానంకు తొండంగి మండలంలో 511 ఎకరాలు భూమి ఉంది. సుమారు 29 ఎకరాల మేర పుంతలు, గట్లు ఉన్నాయి. మిగిలిన 478.46 ఎకరాలకు మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహిస్తుంటారు. ఆ గడువు కాస్తా ఇటీవల ముగిసినప్పటికీ టీడీపీ పెద్దల ఆదేశాలతో వేలం నిర్వహించకుండా దేవదాయశాఖ అధికారులు వాయిదాలపై వాయిదాలు వేసిన వైనాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిిస్థితుల్లో దేవదాయశాఖ స్పందించి తాజాగా ఈ నెల తొమ్మిదిన వేలం నిర్వహణ ప్రకటన విడుదల చేసింది. నాలుగు రోజుల పాటు వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం తొండంగి రామలింగేశ్వరాలయంలో శ్రీసంస్ధానం ఈవో నున్న శ్రీరాములు సమక్షంలో మొదలైన వేలం ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. మరో రెండు రోజులు వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే దేవదాయశాఖ అధికారులు నిస్సిగ్గుగా సంస్థానం భూముల కౌలు వేలం నిర్వహిస్తున్న తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కూడా ఒక మొక్కుబడి తంతుగానే జరుగుతుండటంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
పక్కదారి పట్టిస్తున్న అధికారులు
478.46 ఎకరాలను 175 బిట్లుగా విభజించి రోజుకు 30బిట్లు చొప్పున వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి బిట్టులో అరెకరం నుంచి 10 ఎకరాల వరకూ ఉన్నాయి. మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నారు. దేవదాయ ధర్మాదాయశాఖ కౌలు నిబంధనల ప్రకారం ప్రథమ ధరావత్తుగా ఎకరాకు రూ.3,000 చొప్పున చెల్లించడంతోపాటు రెండేళ్ల శిస్తుకు సరిపడా సాల్వెన్సీ ఽహామీ ధ్రువపత్రాలు సమర్పించాలి. వేలం ఖరారైతే ప్రఽథమ ధరావత్తుతోపాటు ఒక ఏడాది కౌలు శిస్తు ముందుగా చెల్లించాలని నిబంధనల్లో నిర్దేశించారు. ఇవేమీ తమకు వర్తించవన్నట్టు కూటమి నేతలు, ఇందుకు తలాడిస్తూ దేవదాయశాఖ అధికారులు సంస్థానం భూముల వేలాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గడచిన రెండు రోజులుగా జరుగుతోన్న వేలం ప్రక్రియను చూసి అక్కడి కౌలు రైతులే విస్తుపోతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కూటమి నేతల బేరసారాలతో వేలం ప్రక్రియను మొక్కుబడి తంతుగా మార్చేశారంటున్నారు. తాంబూలం ఇచ్చే ఒప్పందానికి ముందుకు వచ్చిన వారికి పాత వేలం సొమ్ముపై నామమాత్రంగా పెంపు చూపించి కట్టబెట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాంబూలానికి సై అంటే గనక ఆ బిట్లు వేలంలో మరెవరూ పోటీకి రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పుతున్నారు. గత రెండు రోజుల్లో 124 ఎకరాలకు వేలం నిర్వహిస్తే కేవలం రూ.51 వేలు అదనపు ఆదాయంగా వచ్చినట్టు చెబుతున్నారంటే కూటమి నేతల పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతంత మాత్రంగా పెరిగిన ఆదాయం
వరి ఎకరాకు కౌలు వేలం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఉంటుంది. దేవదాయ శాఖాధికారులు సోమవారం నిర్వహించిన వేలంలో 30 బిట్లుగా విభజించిన 61.90 ఎకరాలకు రూ.5.94 లక్షల ఆదాయం వచ్చింది. గతంలో ఇవే భూములకు వేలంలో రూ.5,79,300 వచ్చింది. ఈ లెక్కన మూడేళ్ల క్రితం నిర్వహించిన వేలంతో పోలిస్తే అదనంగా రానున్న ఆదాయం కేవలం రూ.15 వేలు కావడం గమనార్హం. మంగళవారం నిర్వహించిన కౌలు వేలంలో మరో 30 బిట్లుగా ఉన్న 63.21 ఎకరాలకు రూ.6.02 లక్షలు ఆదాయం వస్తుందని నిర్ధారించారు. ఈ భూములకు గతంలో రూ.5,66,200 ఆదాయం వచ్చింది. ఈసారి వేలంలో కేవలం రూ.36 వేలు మాత్రమే పెరగడం గమనించదగ్గ విషయం. రెండురోజులుగా నిర్వహిస్తోన్న వేలంలో గతంలో కంటే ఆదాయం రూ.51 వేలు మాత్రమే పెరిగిందంటే వేలం ప్రక్రియలో పారదర్శకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. వాస్తవంగా చూస్తే ఎకరాకు రూ.1,000 పెరిగినా 124 ఎకరాలకు రూ.1.50 లక్షల వరకూ ఆదాయం రావాలి అని లెక్కలు కడుతున్నారు.
కౌలు రైతుల పొట్ట కొడుతున్న కూటమి నేతలు
కూటమి నేతల అభీష్టానికి భిన్నంగా బహిరంగ వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన వారిని పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల మీద పడి జేబులు నింపుకునే ఎత్తుగడతోనే ఇంత కాలం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన కూటమి నేతలు చివరకు రూ.లక్షలు దిగమింగి దొడ్డిదారిన భూములు కట్టబెట్టే కుయుక్తులు పన్నుతున్నారు. ఫలితంగా నిజంగా సాగు చేసుకునే కౌలురైతుల పొట్టకొడుతున్నారని మండిపడుతున్నారు. ప్రొటోకాల్ లేని కూటమి ద్వితీయశ్రేణి నేతలు వేలం నిర్వహిస్తోన్న వేదికను పంచుకోవడంతో రైతులు విస్తుపోతున్నారు. చంద్రబాబు తరువాత టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఇలాకాలోనే శ్రీ సంస్థానం భూముల వేలంలో జరుగుతున్న అక్రమాలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
శ్రీ సంస్థానంలో భూ‘మాయ’
ప్రహసనంగా వేలం తంతు
ముట్టచెప్పిన వారికే హక్కులు
124 ఎకరాలకు పెరిగింది రూ.51 వేలే!

తమ్ముళ్ల స్వరకల్పనలో వేలంపాట!