
ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం
● శాస్త్రోక్తంగా స్థాలీపాక హోమాలు ● రావణబ్రహ్మ వాహనంపై కోలాహలంగా ఊరేగింపు
అన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం సాయంత్రం నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందుకు మంగళవాయిద్య ఘోష నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు అరుంధతీ నక్షత్రం చూపించి, పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, కొంపెల్ల మూర్తి, అర్చకులు దత్తాత్రేయశర్మ, సుధీర్, పరిచారకులు పవన్ పాల్గొన్నారు.
రావణబ్రహ్మ వాహనంపై సత్యదేవుని ఊరేగింపు
సత్యదేవుడు, అమ్మవారిని రాత్రి రావణబ్రహ్మ, వాహనంపై ఘనంగా ఊరేగించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు కొండ దిగువన ఉన్న తొలి పావంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దర్శించి పూజలు చేశారు. అనంతరం రావణబ్రహ్మ వాహనం ముందు కుంభపు రాశి వేసి, కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ, తిరిగి తొలి పావంచా వరకూ ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. ఊరేగింపును చూసేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ఊరేగింపులో పోలీసులు లేకపోవడం, వాహనాలను నియంత్రించకపోవడంతో మెయిన్ రోడ్డుపై కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు గ్రామంలోకి రాకుండా పోలీసులు, అధికారులు మళ్లించకపోవడంతో రెండు వైపుల నుంచీ వాహనాలు వన్‌వేలో రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఊరేగింపులో పోలీసులు లేకపోవడం ఆశ్చర్యం.
అన్నవరంలో నేడు
తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ
ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ
మధ్యాహ్నం 2.30 : అనివేటి మండపంలో సత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో సరస్వతీ పూజ, వేద పండిత సదస్సు రాత్రి 9.00 : కొండ దిగువన పొన్నచెట్టు వాహనంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు
ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : రత్నగిరి కళావేదికపై, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం

ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం