
కూటమి ప్లాన్.. అట్టర్‌ఫ్లాప్
● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన నిర్మాణాలు
● ప్లాన్‌లు ఇవ్వడానికి సర్వేయర్ల నిరాకరణ
● పుర ప్రజలకు గుదిబండగా జీఓ–20
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా సర్కారు నిర్ణయాలు తయారయ్యాయనే విమర్శ వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యవస్థల్లో ప్రభుత్వం తెస్తున్న మార్పులతో మొదటికే మోసం వస్తోంది. మూడు నెలల క్రితం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్‌సీఎస్) కోసం విడుదల చేసిన జీఓ–20 నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు అవరోధంగా మారింది. ఈ జీఓ దెబ్బకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి ప్లాన్‌లు అక్కడే చతికిలపడ్డాయి. ఈ జీఓ అమలులోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపన్నుల నుంచి మధ్య తరగతి వరకూ వారి స్థాయికి తగ్గట్టుగా నిర్మించుకునే ఇళ్లకు ముహూర్తాలు చూసుకుంటారు. అన్నీ చూసుకుని పనులు మొదలు పెట్టాలంటే ముందుగా బిల్డింగ్ ప్లాన్‌లకు అనుమతి రావాలి. దీనిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో నిర్మాణదారులకు పెద్ద సమస్యగా మార్చేసి, చుక్కలు చూపిస్తోంది. కొత్తగా భవనాలు నిర్మించుకోవాలనే వారికి మున్సిపల్ ప్లాన్‌లు ఇచ్చేందుకు సర్వేయర్లు ముందుకు రావడం లేదు.
గతంలో ఇలా..
పట్టణాలు, నగరాల్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్‌ను సంప్రదించి, ప్లాన్ రెడీ చేసుకుంటారు. దరఖాస్తు, ప్లాన్‌తో పాటు సంబంధిత సొమ్మును కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చెల్లించిన అనంతరం ఆ ఫైల్ ఆన్‌లైన్‌లో పట్టణ ప్రణాళికా విభాగానికి చేరుతుంది. న్యాయ, సాంకేతికపరమైన అంశాలతో పాటు నిబంధనలను పరిశీలించిన తర్వాత టౌన్‌ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనం నిర్మిస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది.
ఇప్పుడు సర్వేయర్‌దే బాధ్యత
కూటమి సర్కారు కొత్తగా జారీ చేసిన జీఓ–20 ప్రకారం ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ప్లాన్ గీసిన సర్వేయర్ లేదా ఇంజినీర్ పైనే మొత్తం బాధ్యత పెట్టారు. ప్లాన్ వేసిన అనంతరం సర్వేయర్లు బేస్‌మెంట్, లింటల్, స్లాబ్‌లు.. ఇలా వివిధ దశల్లో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోతే ఆ విషయాన్ని కూడా ప్లాన్ వేసిన సర్వేయరే అప్‌లోడ్ చేయాలి. వాస్తవానికి ఈ ప్రక్రియను మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షించాలి. అన్ని అధికారాలూ ఉండే మున్సిపల్ అధికారులకు కాకుండా తమపై ఈ బాధ్యత పెడితే ఎలాగని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడైనా ఉల్లంఘనలుంటే ప్లాన్ వేసిన సర్వేయర్ లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) ప్రకారం వారిని బాధ్యులను చేస్తారు. ఇదెంతవరకూ సహేతుకమని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ పుణ్యమా అని సర్వేయర్లు ప్లాన్‌లు ఇచ్చేందుకు మూడు నెలలుగా ముందుకు రావడం లేదు. ప్లాన్ వేస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయంతో వారు ఒకవిధంగా పెన్‌డౌన్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఒక ప్లాన్ తయారు చేసి, అప్‌లోడ్ చేసి, అనుమతి లభిస్తే భవన యజమాని నుంచి రూ.ఐదారు వేలు, మరీ ఎక్కువైతే రూ.10 వేలు వస్తాయి. ఈ జీఓ అమలు పుణ్యమా అని చేయని తప్పునకు తామెందుకు బాధ్యత వహించాలని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో మూడు నెలలుగా ప్లాన్‌లు నిలిచిపోయాయి. దీనిపై భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు.
కాకినాడ నగరం
జీఓలో నిబంధనలు సడలించాలి
జీఓ–20లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యలు సవరించడం ద్వారా ఈ జీఓ మరింత ఫలవంతమవుతుంది. భవన నిర్మాణాల్లో యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు లైసెన్స్ సర్వేయర్లను బాధ్యులను చేయడం సరైంది కాదు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించాం. జీఓ అమలులో లైసెన్స్ హోల్డర్ల హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా ఉండేలా చూడాలి.
– సత్తి రాంబాబు, అధ్యక్షుడు, వెల్ఫేర్
అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్
ఇది పరిస్థితి
కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 100 మంది సర్వేయర్లున్నారు. ప్లాన్‌ల ద్వారా కార్పొరేషన్‌కు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.40 లక్షల ఆదాయం వస్తూంటుంది. గడచిన మూడు నెలలుగా రూ.రెండు మూడు లక్షలు కూడా రావడం లేదు. సుమారు వెయ్యి ప్లాన్‌లు ఆగిపోయాయని చెబుతున్నారు.
సామర్లకోట మున్సిపాలిటీలో నలుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్ల వద్దకు గతంలో నెలకు 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చేవి. ఏడాదికి సుమారు 120 ప్లాన్లు అప్‌లోడ్ అవడంతో రూ.52 లక్షల ఆదాయం వచ్చేది. జీఓ–20 కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు.
పెద్దాపురం మున్సిపాలిటీలో నలుగురు సర్వేయర్లున్నారు. ప్లానింగ్ ద్వారా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.లక్ష వస్తే గొప్పన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ప్లాన్‌లు ఇవ్వడం లేదు.
తుని మున్సిపాలిటీలో 20 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రతి నెలా 60 వరకూ ప్లాన్‌లు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. జీఓ–20 అమలులోకి వచ్చాక ప్లాన్‌లు నిలిచిపోయాయి.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలో సుమారు 250 మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30కి మించి దరఖాస్తులు రావడం లేదు.
నిడదవోలు మున్సిపాలిటీలో నలుగురు ప్రైవేటు సర్వేయర్లున్నారు. ఏటా ప్లాన్‌ల కోసం 10 దరఖాస్తులు వచ్చేవి. జీఓ–20 విడుదలైన తరువాత ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
అమలాపురం మున్సిపాలిటీలో 20 మంది ప్రైవేటు సర్వేయర్ల వద్దకు జీఓ–20కి ముందు ప్రతి నెలా 25 నుంచి 35 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు వచ్చేవి. ఈ జీఓ వచ్చిన తరువాత సర్వేయర్లు ప్లాన్‌లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
మండపేట మున్సిపాలిటీలోని 15 మంది ప్రైవేటు సర్వేయర్లు నెలకు సుమారు 20 ప్లాన్‌లు ఇస్తూంటారు. మున్సిపాలిటీకి నెలకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. జీఓ–20తో నెలకు కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వస్తున్నాయి. సర్వేయర్లు ప్లాన్‌లు తయారు చేయడం ఆపేశారు.

కూటమి ప్లాన్.. అట్టర్‌ఫ్లాప్