
ఎక్కడ కలవాలి.. వినతి ఎవరికివ్వాలి..
మున్సిపల్ కార్మికులకు పిఠాపురంలో భంగపాటు
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్‌కు పిఠాపురంలో శనివారం వింత పరిస్థితి ఎదురైంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వినతిపత్రం అందజేయడానికి మున్సిపల్ కార్మికులు కాకినాడ నుంచి గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ కల్యాణ్ తాత్కాలిక నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. అయితే, పిఠాపురం వచ్చేసరికి చేబ్రోలులోని ఇంటిని పవన్ కల్యాణ్ ఖాళీ చేసేశారని తెలిసింది. దీంతో, ఎవరిని, ఎక్కడ కలవాలంటూ వారు తర్జనభర్జనలు పడ్డారు. పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్‌కు అధికారిక కార్యాలయం లేదని తెలియడంతో అవాక్కయ్యారు. అంత కష్టపడి వచ్చి, కనీసం జనసేన ఇన్‌చార్జికై నా వినతిపత్రం ఇద్దామనుకుంటే ఆయన కూడా అందుబాటులో లేరని తెలిసి తలలు పట్టుకున్నారు. చేసేదేమీ లేక పిఠాపురంలోని జనసేన పార్టీ పట్టణ కార్యాలయంలో స్థానిక నాయకుడికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతి ఎమ్మెల్యేకూ అధికారిక కార్యాలయం ఉంటుంది. అలాంటిది ఉప ముఖ్యమంత్రికి ఆయన ఎన్నికై న నియోజకవర్గం పిఠాపురంలో కార్యాలయం లేకపోవడమేమిటంటూ కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం లేకపోతే ప్రజలు తమ సమస్యలపై ఎక్కడ ఎవరిని కలవాలని ప్రశ్నించారు. తమ బాధలు చెప్పుకుని ఆదుకోవాలని అడుగుదామంటే చెప్పుకోవడానికి సరైన నాయకుడు లేక నిరాశతో వెళ్తున్నామని అసహనం వ్యక్తం చేశారు.