
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన టికెట్ల ద్వారా స్వామివారికి రూ.2,71,118 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
వైభవం.. నారసింహుని కల్యాణం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో శనివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం విష్వక్సేన పూజతో అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పెద్దింటి వెంకట శ్రీనివాస్ ఈ కల్యాణం జరిపించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం లడ్డూ ప్రసాదం ఇచ్చి, భోజన సౌకర్యం కల్పించింది.
మహా జ్యేష్టాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష
అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామివారి మూలవరులకు వచ్చే నెల 11న జ్యేష్ట నక్షత్రం సందర్భంగా నిర్వహించనున్న మహా జ్యేష్టాభిషేక ఏర్పాట్లపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, అర్చకులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం అంతర్వేది దేవస్థానం కార్యాలయంలో అర్చకులతో చర్చించారు. సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో స్వామి మూలవర్లకు మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్ రూ.400గా నిర్ణయించామన్నారు. సూపరింటెండెంట్ పి.విజయ సారథి, ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పెద్దింటి వెంకట శ్రీనివాస్, ఎస్‌బీఎం రమేష్ పాల్గొన్నారు.
స్వామిని చూసి.. మది మురిసి
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. తెల్లవారు జామున అర్చకులు సుప్రభాత సేవ, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతిని కనుల పండువలా జరిపించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు తొలి హారతిని దర్శించుకున్నారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు.