
రత్నగిరి.. భక్తజన సంద్రం●
● సత్యదేవుని దర్శించిన 60 వేల మంది
● 5 వేల వ్రతాల నిర్వహణ
● దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం
అన్నవరం: ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు వివాహాల సందడితో రత్నగిరి శనివారం భక్తజనసాగరాన్ని తలపించింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. భక్తుల రద్దీ తట్టుకోలేక మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. మొత్తం 60 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఐదు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి పల్లకీలో వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ప్రాకార సేవ ప్రారంభించారు.
భక్తులకు ఇక్కట్లు
భక్తులు రూ.300 వ్రతాల నుంచి రూ.2 వేల వ్రతాల వరకూ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.1,500 వ్రతాలాచరించే భక్తులను అనివేటి మండపం లోపలకు అనుమతించకపోవడంతో గుమ్మం వద్దనే సుమారు గంటసేపు నిలబడాల్సి వచ్చింది. దేవస్థానంలో వైఫై పని చేయకపోవడంతో ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్స్, క్రెడిట్ కార్డుల ద్వారా వివిధ సేవా టికెట్లు కొనుగోలు చేసే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పని చేయకపోవడంతో నగదుతోనే లావాదేవీలు నిర్వహించారు. వ్రతాల టిక్కెట్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడటంతో ఇదే అదనుగా కొంతమంది ముందుగా వ్రతాల టికెట్లు కొనుగోలు చేసి, బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించారు. అలా విక్రయిస్తున్న వ్యక్తిని ఓ హోంగార్డు పట్టుకుని, మందలించి వదిలేశారు. అప్పటికే అతడు సుమారు 20 వరకూ టికెట్లు విక్రయించాడు. కౌంటర్‌లోని సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని ఆరోపించారు. పశ్చిమ రాజగోపురం వద్ద తగినంత సెక్యూరిటీ లేకపోవడంతో పలువురు భక్తులు ఇష్టానుసారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. గతంలో తీవ్ర రద్దీ ఉన్నప్పుడు ఈఓ, దిగువ స్థాయి అధికారులు ఆలయం వద్దనే ఉండేవారు. దీంతో సిబ్బంది కూడా చురుకుగా పని చేసేవారు. తప్పు చేయడానికి భయపడేవారు. ఇప్పుడు ఎంత రద్దీ ఉన్నా అధికారులు ఆఫీసులకే పరిమితమవుతేండటంతో సరైన నియంత్రణ లేక భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.