
6 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు
కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 6 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా నీటిగుంతలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఐదెకరాల్లోపు సాగు చేసే చిన్న రైతులకు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులకు విద్యుత్తు కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. బోర్ల ద్వారా వరి, మల్బరీ సాగు చేసే రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. గృహ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులకు ఆప్షన్–3 కింద ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత నిర్మించకపోతే మెమోలు జారీ చేసి, బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. అర్హులైన కౌలుదారులందరికీ సీసీఆర్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ వర్గాల ప్రజలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి జేసీ రాహుల్ మీనా, డీఆర్‌ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఈఏపీ సెట్‌కు 95.67 శాతం హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్‌లైన్ పరీక్ష ఆరో రోజైన శనివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 862 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీ డియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్నందున ఇంటర్ బోర్డు లేదా సెంట్రల్ బోర్డు విడుదల చేసిన మార్కుల జాబితాను ఈ నెల 30వ తేదీలోగా ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కన్వీనస్ వీవీ సుబ్బారావు సూచించారు.